తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులుగా విధులు నిర్వహించడం అంటే కత్తి మీద సాములాంటిదే. ఎవరికి కోపం వచ్చినా ముందు ఆలయ నిర్వహణలో లోపాలు అంటూ విమర్శలు చేస్తారు. అలాంటివి తట్టుకోవడానికి ఆ విమర్శలు చేసే వారి డిమాండ్లను ఆలయ ఉన్నతాధికారులు తీర్చాల్సి వస్తోంది. ఆలయంలోకి ఏ హోదా లేని వైసీపీ నేతలు వీఐపీ దర్శనాలను.. సన్మానాలను ఎలా పొందుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు.కానీ లోతుగా ఆలోచిస్తే.. ఆయా నేతల నోటికి భయపడి అధికారులు వారు అడిగిన విధంగా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
రోజాకు ఎలాంటి అధికారి పదవి లేదు. కానీ ఆమె ప్రతి రెండు వారాలకు ఓ సారి అనుచరుల గుంపుతో ఆలయానికి వస్తున్నారు. సన్మానాలు చేయించుకుని మరీ వెళ్తున్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడుతున్నారు. అసలు ఆమెకు ఎలా సాధ్యమవుతోందని అనుకుని ఆరా తీస్తే.. కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో టీటీడీ ఉన్నతాధికారులపై రోజా తీవ్ర ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు అవి చేయడం లేదు. ఎందుకంటే ఆ ఆరోపణలు చేసి.. ఆ ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేశారు. ఏమీ లేపోయినా ఆరోపణలు చేయకుండా ఉండటానికి.. తాను అడిగినప్పుడల్లా దర్శనాలు.. ఇతర వ్యవహారాల్లో పనుల చేసి పెట్టేలా చేసుకున్నారు.
ఒక్క రోజా మాత్రమే కాదు.. భూమన కరుణాకర్ రెడ్డి కూడా అంతే. గతంలో ఆయన ఓ అధికారిపై ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు నేరుగా అధికారుల్ని టార్గెట్ చేయడం లేదు. కానీ ఆయన కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆ అధికారి కూడా ఇప్పుడు భూమన చెప్పిన పనులు చేస్తున్నారని.. తనకు కావాల్సిన వారికి దర్శనాలతో పాటు ఇతర చర్యలు తీసుకోకుండా చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల భూమన చేసిన అవినీతి పై కేసు పెట్టి అరెస్టు చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఆయనకు సమాచారం తెలిసి.. విగ్రహం డ్రామాలు ఆడారు.
తిరుమల అత్యంత సున్నితమైనది. అక్కడి అధికారులు అత్యధికులు దేవుడికి సేవ చేసుకుందామనే వస్తారు. వారిపై నిందలు వేస్తే.. వారి విధి నిర్వహణపై ఆరోపణలు చేస్తే వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. దీన్ని బాగా కనిపెట్టిన వైసీపీ ముఖ్య నేతలు ఆరోపణలు చేసి.. తమ పబ్బం గడుపుకుంటున్నారు. వారు తప్పుడు ఆరోపణలు చేయకుండా.. వారికి గౌరవమర్యాదలు ఇస్తూ.. వారికి పనులు చేసి పెడుతున్నారు. అందుకే కొండపై ఇంకా వైసీపీ నేతల హవా కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు.