ఒక్కొక్కరు గగ్గోలు పెడుతున్నారు. జగన్ రెడ్డి నుంచి సజ్జల వరకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. వారి తీరు చూస్తూంటే ఐదు సంవత్సరాల్లో తాము చేసిందేమిటో మర్చిపోయినట్లుగా నటిస్తున్నారు. కానీ మర్చిపోయేంత చిన్న పనులు కాదు వారి చేసింది. అంతకు మించిన ఘోరాలు చేశారు. అంతటి ఘోరాలు చేసి ఇప్పుడు మళ్లీ బూతులందుకంటూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ క్రమంలో వారు టీడీపీ కార్యకర్తలు కోరుకునే ఎఫెక్ట్ ను తీసుకు వస్తున్నారు.
ఈ ఆర్తనాదాల కోసమే టీడీపీ క్యాడర్ వెయిటింగ్
వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు టీడీపీ క్యాడర్ పడిన టార్చర్ అంతా ఇంతా కాదు. ఐదేళ్ల కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక అగ్నిపరీక్షలా సాగింది. నిత్యం వేధింపులు, అక్రమ కేసులు, శారీరక దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన క్యాడర్.. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. అప్పట్లో ప్రత్యర్థులు ప్రదర్శించిన వికృతానందం కార్యకర్తల గుండెల్లో లోతైన గాయాలను మిగిల్చింది. మేము అధికారంలోకి వస్తే. అని ప్రతిరోజూ పంటిబిగువున ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రదర్శించిన సంయమనం కార్యకర్తలను కొంతకాలం నిశబ్దంగా ఉంచింది. కానీ ఇప్పుడు కట్టు తెగేలా వైసీపీ వాళ్లే చేస్తున్నారు.
రెచ్చగొట్టి కొట్టించుకుంటే సానుభూతి వస్తుందా ?
బాధ్యతాయుతమైన పాలన అందించాలన్న అధినేత ఆకాంక్షను గౌరవిస్తూనే, లోలోపల రగులుతున్న ఆగ్రహాన్ని కార్యకర్తలు ఇన్నాళ్లూ అదుపులో ఉంచుకున్నారు. కానీ, ప్రస్తుతం వైసీపీ నేతలు దీన్ని చేతకానితనంగా భావించి వారి పాత ధోరణిని గుర్తుచేస్తుండటంతో టీడీపీ క్యాడర్ సహనం కట్టలు తెంచుకుంది. అప్పుడు మీరు పెట్టిన టార్చర్ గుర్తే లేదా అన్న ప్రశ్న ఇప్పుడు ఊరూరా వినిపిస్తోంది. తమను చిత్రహింసలకు గురిచేసినప్పుడు లేని నీతులు ఇప్పుడు వినిపిస్తుండటంపై తమ్ముళ్లు తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్ సహా వైసీపీ నేతలు ఇప్పుడు వినిపిస్తున్న ఆర్తనాదాలను చూస్తుంటే.. టీడీపీ కార్యకర్తలకు అది ఒక రకమైన ఊరటను ఇస్తోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అన్నది వారి స్పష్టమైన హెచ్చరిక.
ఈ మంటకు ఎంత సెగ అనేది వైసీపీ చేతుల్లోనే !
ఐదేళ్లలో తాము పడిన ప్రతి కన్నీటి బొట్టుకు, ఎదుర్కొన్న ప్రతి అవమానానికి కాలం సమాధానం చెబుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. అరాచక పాలనలో నలిగిపోయిన సామాన్య కార్యకర్త ఇప్పుడు ఆత్మగౌరవం కోసం గళమెత్తుతున్నాడు. ముందు ముందు వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అక్రమానికి, అరాచకానికి ధీటైన కౌంటర్ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. వచ్చారు.. చూశారు.. ఇప్పుడే మొదలైంది అన్న చందంగా సోషల్ మీడియా వేదికలు హోరెత్తుతున్నాయి. ఇది కేవలం రాజకీయ అధికారం కోసం చూస్తున్న నిరీక్షణ కాదు, తమపై జరిగిన దాడులకు, అవమానాలకు ధర్మబద్ధమైన సమాధానం చెప్పాలన్న పట్టుదల కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఈ రగడ.. ఐదేళ్ల అణచివేత నుండి పుట్టిన ఆగ్రహజ్వాల అని చెప్పక తప్పదు.
