శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ మీద కోపాన్ని ఇతర పార్టీల సభ్యుల మీద చూపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దాడి చేయడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించడం గురువారం శాసనమండలిలో హాట్ టాపిక్ గా మారింది.
రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించామని ప్రకటించారని..దానిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వచ్చిన ప్రశ్నలో భాగంగా ఈ చర్చ వచ్చింది. సభ్యులు మాట్లాడిన తర్వాత మంత్రి సమాధానం ఇచ్చారు . సమాధానం అయిపోయిన తర్వాత తదుపరి ప్రశ్నకు మండలి చైర్మన్ వెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్న కు సమాధానం పూర్తయినందున ఇక దానిపై చర్చ ఉండదని చెప్పిన మండలి చైర్మన్ తదుపరి ప్రశ్న అడిగేందుకు..సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు.
సోము వీర్రాజు లేచి తన ప్రశ్న అడిగే సమయంలోనే వైసీపీ సభ్యులు ఆయన వైపు దూసుకొచ్చారు. ప్రశ్న అడగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నించారు. ఆయనకు పోటీగా ఇతర ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. అయితే సోము వీర్రాజుకు రక్షణగా హోంమంత్రి అనితతో పాటు ఇతర టీడీపీ సభ్యులు నిలబడ్డారు. ఈ క్రమంలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో చైర్మన్ కొద్ది సేపు మండలిని వాయిదా వేశారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరు వివాదాస్పదమయింది.