తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం చివరి దశకు చేరడంతో ఎన్డీఏ నేతలు ప్రచారానికి తమ కూటమిలోని కీలక నేతల్ని ఆహ్వానిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగుతున్నారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఆయన తమిళనాడులో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రాష్ట్రంలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్డీఏ కూటమి, చంద్రబాబు చరిష్మాతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని వ్యూహం రచించింది.
సోమవారం మధ్యాహ్నం ఆయన నేరుగా కోయంబత్తూరు చేరుకోవడంతో ఈ ప్రచార పర్వం ప్రారంభం కానుంది. చంద్రబాబు పర్యటన ప్రధానంగా కోయంబత్తూరు, హోసూరు, చెన్నై , ఆవడి వంటి ప్రాంతాల్లో సాగనుంది. ఈ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజల జనాభా నిర్ణయాత్మక శక్తిగా ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక హబ్‌లుగా ఉన్న కోయంబత్తూరు, హోసూరులలో స్థిరపడిన తెలుగు వారితో చంద్రబాబుకు దశాబ్దాల కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ అవశ్యకతను, ఏపీలో అమలవుతున్న అభివృద్ధి నమూనాను ఆయన వివరించనున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో తెలుగు ఓటర్లు సుమారు 15 నుంచి 20 శాతం వరకు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, చంద్రబాబు ప్రచారం ఎన్డీఏకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కోయంబత్తూరు పర్యటన ముగించుకుని మంగళవారం ఆయన చెన్నై పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. చెన్నై నగరంలోని తెలుగు ప్రాబల్యం ఉన్న ఆవడి వంటి చోట్ల భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో అన్ని కూటములు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రచారం చేస్తున్నాయి.
