ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్‌కు సైనసైటిస్ శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న ప్రధాని, ఆదివారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ ధైర్యవంతుడని, ఆయన త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాను. ఆయన అసాధారణమైన ధైర్యశాలి. ఆయన చాలా త్వరగా కోలుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను” అని పోస్ట్ చేశారు. ప్రధాని స్వయంగా స్పందించడం పవన్ కల్యాణ్ పట్ల కేంద్రానికి ఉన్న ప్రాధాన్యతను, వ్యక్తిగతంగా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరోసారి చాటిచెప్పింది.
అపోలో ఆసుపత్రిలో జరిగిన ఈ చిన్న శస్త్రచికిత్స తర్వాత పవన్ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రధాని ఫోన్ చేసిన సమయంలో పవన్ కల్యాణ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు పవన్ ఎవరినీ కలవకుండా పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపారు.
