‘కొత్తకు ఎప్పుడూ స్వాగతం… పాతకు వందనం…” అన్నాడో కవి. అలానే కొత్తేడాదికి స్వాగతం పలుకుతూనే, పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాల్సిన తరుణం వచ్చేసింది. 2025లో టాలీవుడ్ పెద్దగా సంచలనాలు సృష్టించిందేం లేదు. విజయాలు ఎప్పటిలా 10 శాతాన్ని మించలేదు. సంక్రాంతి సమయంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, పవన్ కల్యాణ్ వదిలిన ఓజీ.. బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకొన్నాయి. మధ్యలో కోర్ట్, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు మెరిశాయి. అడపా దడపా ఒకట్రెండు విజయాలతో టాలీవుడ్ సరిపెట్టుకొంది. అయితే సంగీత ప్రపంచంలో మాత్రం కొన్ని మెరుపులు వినిపించాయి. కొన్ని పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. రీల్స్ వాళ్లకోసమే ఈ పాటలు డిజైన్ చేశారా అనే సందేహాలు వచ్చినంతగా… రీల్స్ లో తెగ హల్ చల్ చేశాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హడావుడి సృష్టించిన కొన్ని పాటల్ని మరోసారి హమ్ చేసుకొంటే…
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అతి పెద్ద హిట్… ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ఆల్బమ్ లోనే అతి పెద్ద మ్యూజికల్ హిట్ అయిన పాట కూడా ఉంది. అదే.. ‘గోదారి గట్టు’. రమణ గోగుల కమ్ బ్యాక్ ఇచ్చిన పాట ఇది. భాస్కరభట్ల సాహిత్యం, పాట ప్లేస్ మెంట్ బాగా కుదిరాయి. ఈ పాటతోనే…ఈ సినిమాకు సగం ప్రమోషన్లు జరిగిపోయాయి. విడుదలకు ముందు, ఆతరవాత కూడా గట్టిగా హల్ చల్ చేసిన పాట ఇది. ‘గేమ్ ఛేంజర్’ అభిమానుల్ని నిరాశ పరిచినా ‘జరగండి.. పాట కాస్త గట్టిగానే సౌండ్ చేసింది. ‘డాకు మహారాజ్’లో దబిడి దిబిడి మాస్‌ని ఊపింది. అందులో ‘నా బంగారు కూన’ మంచి మెలోడీగా నిలిచింది. ‘తండేల్’లో ‘బుజ్జి తల్లి’ మార్మోగిన పాటల్లో మరోటి. దేవిశ్రీ ప్రసాద్ కంపోజీషన్లో ఉన్న మ్యాజిక్ ఈ పాటతో తెలిసొచ్చింది. వైబ్ ఉంది పిల్లా (మిరాయ్), అదిదా సర్ ప్రైజూ (రాబిన్ హుడ్), ఇంటి పేరు (స్వాతి రెడ్డి), వైరల్ వయ్యారి (జూనియర్) మంచి బీటున్న పాటలుగా మారాయి. కోర్ట్ సినిమాలో `కథలెన్నో చెప్పారు` పాట సగం ప్రచారాన్ని చేసేసింది. రీల్స్ లో ఎక్కువగా కనిపించిన పాట ఇది. చిన్న సినిమాల్లో మెరిసిన ‘లిటిల్ హార్ట్స్’లో కూడా పాటలు బాగున్నాయి. హల్లో అని పాట యూత్ కి నచ్చింది.
2025లో టాలీవుడ్ కి దక్కిన మరో పెద్ద హిట్ ‘ఓజీ’. ఈసినిమాలో పాటలెక్కువగా వెస్ట్రన్ స్టైల్ లో సాగాయి. ఫైర్ స్ట్రామ్.. సువ్విసువ్వి పాటలు మార్మోగాయి. రామ్ సినిమా ‘ఆంధ్రా కింగ్’ లో కూడా పాటలు బాగున్నాయి. నువ్వుంటే చాల్లే, చిన్ని గుండెలో పాటలు వైరల్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాల్లో బాగా వినిపించిన పాటగా ‘మోనికా’ (కూలీ) నిలిచింది. ‘తెలుసు కదా’ సినిమా ఫ్లాప్ అయినా పాటలు బాగా కుదిరాయి. సిద్ద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసిందే’ పాట సూపర్ హిట్ అయ్యింది.
రాబోయే సినిమాల్లో కూడా కొన్ని మంచి పాటలు వినిపిస్తున్నాయి. ‘ఛాంపియన్’లోని ‘గిర గిర’ క్షణాల్లో ఎక్కేసింది. ‘పెద్ది’లోని ‘చికిరి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 100 మిలియన్ క్లబ్బులో చేరిన పాట ఇది. ‘మన శంకర వర ప్రసాదు గారు’లోని ‘మీసాల పిల్ల’ ఫ్యాన్స్ కే కాదు, అందరికీ నచ్చేసింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లోని ‘దేఖ్
లేంగే సాలా..’ లేటెస్ట్ సంచలనం. ఈ మూడు ఆల్బమ్స్ నుంచి ఇంకా పాటలు రావాల్సివుంది. సో… మ్యూజికల్ పరంగా 2026 కూడా గట్టిగా వినిపించే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
