గీతా ఆర్ట్స్ 2 వ్యవహారాలన్నీ బన్నీవాస్ చూసుకొంటుంటారు. ఒక రకంగా గీతా ఆర్ట్స్‌కి బన్నీ వాస్ మూల స్థంభం. ఇప్పుడాయన కొత్తగా ఓ బ్యానర్ పెట్టారు. ఆ సంస్థలో తనకు నచ్చిన సినిమాలు చేసుకోవాలన్నది ప్లాన్. ”నాకు నచ్చిన కథలు కొన్ని అరవింద్ గారికి నచ్చవు. అలాంటి కథలేమైనా ఉంటే, వాటిని నేను ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఓ సంస్థని స్థాపిస్తా” అని బన్నీవాస్ ఇది వరకే చెప్పారు. అన్నట్టుగానే బ్యానర్ పెట్టుకొన్నారు. అందులో భాగంగా `మిత్రమండలి` అనే సినిమా రూపొందించారు.
బన్నీ వాస్ అనుకొంటే.. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లతో కాంబినేషన్లు సెట్ చేసుకోవొచ్చు. ఆ మాత్రం పలుకుబడి ఉంది. పెట్టుబడిని కూడా ఆయన సమీకరించుకోగలరు. కానీ ‘జాతిరత్నాలు’ టైప్ లో ఓ చిన్న సినిమా తీశారు. ఓరకంగా మంచి ఆలోచనే. బ్యానర్ వాల్యూతో వచ్చే చిన్న సినిమాలకు వాల్యూ ఉంటుంది. సితార సంస్థ అదే చేస్తోంది. ఆ సంస్థలోంచి వచ్చిన మ్యాడ్, మ్యాడ్ 2, టిల్లు సినిమాలు బాగా ఆడాయి. లాభాలు ఆర్జించాయి. నాని కూడా తన బ్యానర్లో చిన్న సినిమాలే తీస్తున్నాడు. ఇప్పుడు బన్నీ వాస్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. ఓటీటీ బేరాలకు ఢోకా ఉండదు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ గ్యాంగ్ ఉంది కాబట్టి పెట్టుబడి మొత్తం ఓటీటీ రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓరకంగా విడుదలకు ముందే సేఫ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓ నిర్మాతకు అంతకంటే ఏం కావాలి? గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన ‘ఆయ్’ కూడా ఇలానే సేఫ్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ ని దగ్గరుండి చూసుకొన్నది బన్నీ వాసే. కాబట్టి ఆ అనుభవంతో ఈ సినిమాని టేకప్ చేసి ఉండొచ్చు.
బన్నీ వాస్ మరో బ్యానర్ పెట్టగానే కాస్త నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి విడిపోయాడా? అరవింద్ తో పడడం లేదా? లాంటి ఊహాగానాలు మొదలవుతాయి. అలాంటివి ఏం రాకుండా, టీజర్ ఆవిష్కరణకు అరవింద్ ని పిలుచుకొచ్చాడు. ‘నా గాడ్ ఫాదర్’` అంటూ ఘనంగా చెప్పుకొన్నారు. కాబట్టి ఆ రిస్క్ కూడా తీసి పారేసుకొన్నట్టే.