హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడంతో అనంతబాబుకు బెయిల్ రద్దు టెన్షన్ పట్టుకుంది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే, ఆయన బయట ఉంటూ ఈ కేసులోని ప్రధాన సాక్షులను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ,బెదిరింపులకు గురిచేసేందుకు ప్రయత్నించారు. సాక్షులను కొనేందుకు ప్రయత్నిస్తూ ఆయన అడ్డంగా దొరికిపోవడంతో, రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు తాజాగా బెయిల్ రద్దు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇది సుప్రీంకోర్టు విధించిన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు.
గతంలో ఈ కేసులో పోలీసులు నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదన్న సాంకేతిక కారణంతో అనంతబాబుకు బెయిల్ లభించింది. హైకోర్టులో పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైనప్పటికీ, సుప్రీంకోర్టు 2022 డిసెంబర్లో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అప్పటి నుండి ఆయన బయటే ఉన్నారు. అయితే, సాక్షులను ప్రభావితం చేయకూడదనేది అందులోని ప్రధాన నిబంధన.
ఈ కేసులో కీలక సాక్షులకు భారీ మొత్తంలో నగదు ఆశ చూపడమే కాకుండా, మాట వినని వారిని ప్రాణాలతో ఉండనివ్వబోమని హెచ్చరించినట్లు సాక్ష్యాధారాలు లభించాయి. దీనిపై పీపీ కోర్టుకు వివరిస్తూ.. అనంతబాబు బయట ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, కేసును తారుమారు చేసే ప్రమాదం ఉందని వాదించారు. నిందితుడు తన పరపతిని ఉపయోగించి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
2022 మే నెలలో తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని స్వయంగా డోర్ డెలివరీ చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక దళిత యువకుడిపై జరిగిన ఈ దాడి విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బెయిల్ రద్దు పిటిషన్‌తో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. కోర్టు గనుక పీపీ వాదనతో ఏకీభవిస్తే అనంతబాబు మళ్లీ జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు.
