పిఠాపురం నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఫ్లెక్సీ వివాదంపై చంద్రబాబు .. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో చర్చించారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచాల్సిన నేతలే చిన్న చిన్న ఫ్లెక్సీల కోసం వీధికి ఎక్కడం ఏంటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కేవలం ఒక పార్టీ నేత మాత్రమే కాదని, ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం అని గుర్తు చేస్తూ.. ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది కూటమి ఐక్యతను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
వర్మకు, జనసేన నేత దొరబాబుకు మధ్య ఉన్న పాత రాజకీయ శత్రుత్వమే ఈ గొడవకు ఆజ్యం పోసిందని అధిష్టానం గుర్తించింది. ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి ఫోటో లేదనో సాకులు వెతుక్కోవడం కాకుండా, సమన్వయంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాలి తప్ప, ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు అన్నారు.
పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగి పిఠాపురం నేతలను సమన్వయం చేసే పనిలో పడ్డారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున, అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఆదర్శంగా ఉండాలని అధినేత కోరుకుంటున్నారు.పిఠాపురం అనేది రాష్ట్రానికే ఒక రాజకీయ నమూనా అని, అక్కడ ఇరు పార్టీల నేతలు పాలు-నీళ్లలా కలిసి ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. చిన్న చిన్న ఫ్లెక్సీ గొడవలను పెద్దవి చేసి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని, వెంటనే వర్మతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పల్లా శ్రీనివాస్‌కు సూచించారు.


