పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న జగన్ రెడ్డికి ప్రజలు తమ కష్టాలు చెప్పుకుందామని వస్తే, ఆయన మాత్రం వారికి ఒక వినూత్నమైన సలహా ఇచ్చి షాక్ ఇచ్చారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని, పరిహారం అందడం లేదని మొరపెట్టుకున్న బాధితులకు జగన్ ఇచ్చిన సమాధానం విని జనం నోళ్లెళ్లబెట్టారు. న్యాయం జరగకపోతే మూడేళ్లు కళ్లు మూసుకోండి.. మనం అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుందాం అంటూ భరోసా ఇచ్చారు. అంటే, ప్రస్తుతానికి ఇళ్లు పోయినా, నిలువ నీడ లేకపోయినా.. కళ్లు మూసుకుని ధ్యానం చేసుకుంటే సరిపోతుందన్నమాట!
జగన్ మాటలు విన్న బాధితులు వెంటనే తేరుకుని, మరి ఈ మూడేళ్లు మేము ఎక్కడుండాలి ” అని నేరుగా మొహాన్నే అడిగేసరికి.. ప్యాలెస్ పాలిటిక్స్‌కు అలవాటు పడ్డ జగన్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనదైన స్టైల్లో ఒక చిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, సమాధానం దాటవేసి కాన్వాయ్‌లో ముందుకు సాగిపోయారు. కనీసం ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామనో, పోరాటం చేస్తామనో చెప్పాల్సింది పోయి, మనం వచ్చేవరకు కళ్లు మూసుకోండి అని చెప్పడం చూస్తుంటే.. ప్రజల కష్టాల కంటే ఆయనకు 2029 సీటే ముఖ్యంలా కనిపిస్తోందని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కాను అని గొప్పలు చెప్పుకున్న జగన్, ఇప్పుడు విపక్షంలోకి రాగానే కళ్లు మూసుకోండి అని కొత్త మంత్రాన్ని పఠిస్తున్నారు. పోలవరం నిర్వాసితులు అడిగినా, ఇళ్లు కోల్పోయిన వారు అడిగినా.. జగన్ దగ్గర ఉన్న ఏకైక పరిష్కారం మూడేళ్లు వెయిటింగ్ . జగన్ రెడ్డి గారు ఇచ్చే ఈ సలహాలు చూస్తుంటే, ప్రజలు కూడా వచ్చే ఎన్నికల వరకు ఆయన మాటల విషయంలో చెవులూ, కళ్లూ మూసుకోవాలేమో అని సెటైర్లు పేలుతున్నాయి.
