కాళేశ్వరంలో జరిగిన అవకతవకల విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పులు ఎవరు చేశారు.. బాధ్యత ఎవరు వహించాలన్నది కూడా స్పష్టంగా పేర్లతో సహా సూచించింది. ఇందులో రాజకీయ నిర్ణయాల పరంగా కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ లను పేర్కొన్నారు. అదే సమయంలో వారి నిర్ణయాలను నిబంధనల గురించి ఆలోచించకుండా పాటించిన అధికారులూ కాళేశ్వరంలో నిండా మునిగిపోయారు. అలాంటి వారిలో స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు.
బోనెక్కబోతున్న “ఎస్ బాస్” అధికారులు
కాళేశ్వరం నిర్మాణంలో నేరుగా పాలు పంచుకున్న.. ముఖ్యంగా నిర్ణయాత్మక బాధ్యత ఉన్న అధికారులందర్నీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బాధ్యులను చేసింది. ఇందులో నాటి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పాటు.. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం సీఎంవోలో నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసిన ఇతర ఇంజినీర్ల పేర్లనూ జస్టిస్ ఘోష్ ప్రస్తావించారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే అక్రమాస్తులు కూడబెట్టి.. జైళ్లలో ఉన్నారు. మిగతా వారి సంగతి చూడనున్నారు.
స్మితా సబర్వాలే కీలకం !
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి మెదక్ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న స్మితా సబర్వాల్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అభిమానం సంపాదించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన సమయంలో ఆనందభాష్పాలు రాల్చి ఆమె మీడియాలో హైలెట్ అయ్యారు. కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. ఫలితంగా ఆమెకు నేరుగా సీఎంవోలో చేరిపోయారు. సీఎంవోలో నీటి పారుదల శాఖ మొత్తం ఆమె కనుసన్నల్లో ఉండేది. ఎంతగా అంటే.. హెలికాఫ్టర్‌లో కాళేశ్వరం పనులను పరిశీలించడానికి వెళ్లేవారు. సాధారణంగా అత్యవసరం అయితే చీఫ్ సెక్రటరీ మాత్రమే హెలికాఫ్టర్ వాడతారు. కానీ స్మితా సబర్వాల్ కు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు హెలికాఫ్టర్ రెడీగా ఉండేది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఆమెను పిలిచి ప్రశ్నించింది. అయితే దేనికీ సమాధానాలు సరిగ్గా చెప్పలేదని.. తాను మర్చిపోయానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు
ప్రభుత్వ సర్వీసులో ఉండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు స్మితా సబర్వాల్. ఆమెకు టూరిజం శాఖ లాంటి ప్రాధాన్య శాఖ బాధ్యతలు ఇచ్చినా… ఆమె ప్రతిపాదనలో మిస్ వరల్డ్ లాంటి పోటీల నిర్వహణకు అంగీకరించినా… కంచ గచ్చిబౌలి విషయంలో ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారు. దీంతో ఆమెపై కేసు కూడా నమోదు అయింది. తర్వాత ప్రభుత్వం ఆమెను ఉన్న పళంగా అప్రాధాన్య శాఖకు పంపించారు. తాను ఐఏఎస్‌ను అన్న సంగతి మర్చిపోయి తాను షేర్ చేసిన ఫోటోను వందల మంది షేర్ చేశారని.. వారిపై కేసు పెడతారా అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆమె పొలిటికల్ గా వ్యవహరిస్తున్నట్లుగా నిర్దారించుకుని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
దొరికింది కదా అని దోచుకున్న ఇంజినీర్లు
స్మితా సబర్వాల్ … నేరుగా ఆదేశాలు ఇస్తూండటం.. నిబంధనల గురించి పట్టించుకోవద్దని.. చెప్పింది చేయమని ఇంజినీర్లను హెచ్చరించడంతో వారంతా తమ పని తాము చేసుకుపోయారు. అదే సమయంలో కాంట్రాక్టర్లు తమ అవసరాలను తీర్చడంతో అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు వారంతా అక్రమాల కేసుల్లో ఇరుక్కుపోయారు. సంపాదించుకున్నదంతా ఏసీబీ పట్టుకుంది. రేపు ఈడీ రంగంలోకి వస్తుంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ముందూ వెనుకా ఆలోచించకుండా.. రూల్స్ పట్టించుకోకుండా ఎస్ బాస్ అన్నవారికి గడ్డు పరిస్థితులు రానున్నాయి.