ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని జగన్ ప్రెస్మీట్లో ఓ జాబితా ప్రకటించారు. ఆ జాబితాలో ఆయనకే చెందిన భారతి సిమెంట్స్ ఉంది. ఆ జాబితా చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ కంపెనీలన్నీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడుల పేరుతో ఏపీలో ఆస్తులు ఆక్రమించుకుంటాయి. జగన్ అధికారంలో లేకపోతే వాటి దగ్గర పెట్టుబడులకు డబ్బులు ఉండవు. అయితే అనూహ్యంగా జగన్ ఈ జాబితాలో భారతి సిమెంట్స్ ను చేర్చడం చాలా మందిని ఆశ్చర్యపోయింది.
ప్రభుత్వం వేధిస్తున్నందున తమ సంస్థను కూడా తరలిస్తామని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం ఏ విషయంలో వేధించింది అంటే.. అక్రమంగా ఆయన కేటాయింపు చేసుకున్నా.. స్వాధీనం చేసుకున్న లీజుల గురించి నోటీసులు ఇచ్చినందుకే వేధింపులు అంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తన కుటుంబ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల విలువైన గనులను కట్టబెట్టుకున్నారనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. భారతి సిమెంట్స్‌కు కేటాయించిన లీజుల్లో నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో ప్రస్తుత ప్రభుత్వం ఆ లీజులను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకే బెదిరింపులకు దిగుతున్నారు.
భారతి సిమెంట్స్ అసలు పేరు భారతి సిమెంట్స్ కాదు. రఘురాం సిమెంట్స్. వైఎస్ సీఎం అయ్యాక దాన్ని జగన్ కొనుగోలు చేశారు. రఘురాం సిమెంట్స్ కంపెనీకే సున్నపురాయి లీజులు ఉన్నాయి. భారతి సిమెంట్స్ గా మారిన తర్వాత ఆ లీజుల్ని కూడా కంపెనీ వాడేసుకుంటోంది. కేంద్రం గనుల విషయంలో చాలా స్పష్టమైన పాలసీ తీసుకుంది. ఓ కంపెనీ పేరుతో లీజులు తీసుకుని మరొకరు ఆ కంపెనీని టేకోవర్ చేస్తే లీజులు చెల్లవని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తులు చేసుకుని ఉన్నా సరే.. అవి ల్యాప్స్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో భారతి సిమెంట్స్ లీజులు గందరంగోళంగా పడ్డాయి. 2017లో ఏపీ ప్రభుత్వం రఘురామ్ సిమెంట్స్ కు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని రద్దు చేసింది.
జగన్ అధికారంలోకి వచ్చాక లీజులను మళ్లీ తన కంపెనీ పేరుతో లీజులను పునరుద్ధరించుకునేందుకు ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని, అడ్వకేట్ జనరల్ ను పావుగా వాడుకున్నారు. న్యాయసలహా అంటూ లీజుల్ని పునరుద్ధరించేసుకున్నారు. నిబంధనలను అనుసరించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినా న్యాయసలహా పేరుతో లీజుల్ని పునరుద్ధరించుకున్నారు. ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరిలోనే లీజుల్ని పునరుద్ధరిస్తూ జీవోలు జారీ చేశారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కేంద్రం విచారణ చేయాలని రాష్ట్రానికి లేఖ రాసింది. అసలు విషయం బయటకు వచ్చింది. ఆ అక్రమ కేటాయింపులపై నోటీసులు జారీ చేస్తే.. వెళ్లిపోతామని.. బెదిరించడమే కాదు.. తమ బినామీ గ్రూపుకంపెనీలన్నింటినీ చేర్చి మరీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
