రాజకీయ కారణాలతో వ్యాపార సంస్థలపై దాడులు చేయడం అనేది వైసీపీ రాక్షస రాజకీయంలో ఓ భాగం. అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలపై చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు. మార్గదర్శి మీద చేసిన దాడి.. కార్పొరేట్ ప్రపంచాన్ని వణికించింది. అత్యంత ఘోరమైన నేరమనస్థత్వం గలవాళ్లు ప్రభుత్వం లో ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూశారు.
వ్యాపార సంస్థలపై దాడులు వైసీపీ రాక్షస రాజకీయం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న కార్పొరేట్ అటాక్ వ్యూహం ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని సంస్థలనే టార్గెట్ చేసిన చరిత్ర ఉన్న వైసీపీకి, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన హెరిటేజ్ నుంచి ఎదురవుతున్న ఈ న్యాయపరమైన ప్రతిఘటన ఒక గట్టి హెచ్చరిక . గత ప్రభుత్వ హయాంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలపైనే కాకుండా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ వంటి వ్యాపార సంస్థలపైనా అసాధారణ స్థాయిలో దాడులు జరిగాయి. మార్గదర్శి కేసులో అర్ధరాత్రి దాడులు చేయడం, ఖాతాదారులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు కార్పొరేట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాతో అవే దాడులు చేస్తున్నారు.
అవి రాజకీయ విమర్శలు కాదు !
సాధారణంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు కేవలం మాటలకే పరిమితమవుతాయి. కానీ, ఒక వ్యాపార సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడితే అది పరువు నష్టం కిందకు వస్తుంది. హెరిటేజ్ సంస్థ ఈ విషయంలో రాజీ పడకుండా నేరుగా బి.ఎన్.ఎస్ చట్టం కింద నోటీసులు ఇవ్వడం చూస్తుంటే, బొత్స సత్యనారాయణను న్యాయస్థానం మెట్లు ఎక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఏవైనా మాట్లాడవచ్చు అనే ధీమా ఇక్కడ పనిచేయదు. కోర్టులో ప్రతి మాటకు ఆధారాన్ని చూపించాల్సి ఉంటుంది.
సేఫ్ జోన్లో జగన్.. చిక్కుల్లో బొత్స
ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయించేది వైసీపీ అగ్రనాయకత్వం అయినప్పటికీ, వాటిని గొంతు విప్పి చెప్పే నేతలే బలిపశువులవుతున్నారు. సాక్షి పత్రికలో కథనం వస్తుంది, దాన్ని బొత్స మీడియా ముందు చదువుతారు. కానీ లీగల్ నోటీసు వచ్చేసరికి అది వ్యక్తిగతంగా బొత్స పేరు మీద వస్తుంది. దీంతో కోర్టుల చుట్టూ తిరగడం, లీగల్ ఖర్చులు భరించడం అంతా ఆ నేత వ్యక్తిగత బాధ్యతగా మారిపోతుంది.
ఇందాపూర్ నుంచి కూడా నోటీసుల ముప్పు
మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ సంస్థకు మధ్య లేని సంబంధాన్ని అంటగట్టడం ద్వారా బొత్స మరో కంపెనీని కూడా వివాదంలోకి లాగారు. ఇప్పటికే హెరిటేజ్ నోటీసు ఇవ్వగా, ఇందాపూర్ డైరీ కూడా తమ ప్రతిష్టను దెబ్బతీసినందుకు బొత్సపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, బొత్స కేవలం ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కోర్టుల్లో కూడా హాజరు కావాల్సి ఉంటుంది. ఇది ఒక సీనియర్ నేతకు రాజకీయంగా పెద్ద ఇబ్బందే.
హెరిటేజ్ సంస్థ 33 ఏళ్లుగా పాటిస్తున్న ప్రమాణాలు, దక్కించుకున్న అంతర్జాతీయ అవార్డులను నోటీసులో ప్రధానంగా ప్రస్తావించింది. ఒక లిస్టెడ్ కంపెనీగా తన పారదర్శకతను నిరూపించుకోవడానికి ఆ సంస్థ ఎంతవరకైనా వెళ్లే అవకాశం ఉంది.
