‘లవ్ టు డే’, ‘డ్యూడ్’ సినిమాలతో తనదంటూ ఓ మార్క్ సృష్టించుకొన్నాడు ప్రదీప్ రంగనాథ్. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. తమిళంలో దాదాపుగా స్టార్ అయిపోయాడు ప్రదీప్. అక్కడ మరో ధనుష్ అంటున్నారు. ధనుష్ కోసం రాసుకొన్న కథలన్నీ ఇప్పుడు ప్రదీప్ దగ్గరకు వస్తున్నాయి. యూత్ లో తన క్రేజ్ మామూలుగా లేదు. తన చేతిలో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలున్నాయి. కోలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న యంగ్ హీరో ఇతనే. ఇంకా దర్శక నిర్మాతలు క్యూలోనే ఉన్నారు.
ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకొనే పనిలో ఉన్నాడు ప్రదీస్. అందుకే సినిమాకు పాతిక కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ మార్కెట్ వుంది కాబట్టి, అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలూ సిద్ధంగానే ఉండాలి. కానీ ప్రదీప్ దగ్గర డేట్లు లేవు. తెలుగు నుంచి కూడా తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘డ్యూడ్’ తీసిన మైత్రీ మూవీస్ సంస్థ ప్రదీప్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. రెండు మూడు అగ్ర సంస్థలు అడ్వాన్సులు ఇచ్చాయి. వాటికి సంబంధించిన కథలు రెడీ అవుతున్నాయి. ‘లవ్ టుడే’కి ముందు ప్రదీప్ అంటే ఎవరికీ తెలీదు. తను హీరోగా చేస్తానంటే ఎగతాళి చేసినవాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు అక్షరాలా పాతిక కోట్లు ఇచ్చినా సినిమా చేసేంత టైమ్ ప్రదీప్ కు లేదు. కెరీర్ గ్రోత్ అంటే ఇలా ఉండాలి..!
