తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అవసరాన్ని బట్టి మంత్రుల్ని చేర్చుకున్నారు కానీ పునర్ వ్యవస్థీకరణ చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ ఆ పని చేయాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టించడానికి టీమ్‌లో మార్పులు కావాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పనితీరు సరిగ్గా లేని ముగ్గురు మంత్రులను తప్పించి, వారి స్థానంలో కొత్తవారికి చోటు కల్పించేలా రేవంత్ పక్కా వ్యూహంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పాలనలో వేగం కోరుకుంటున్న రేవంత్
రేవంత్ రెడ్డి ఈ మార్పుల ద్వారా పాలనలో ఉన్న స్తబ్దత ను తొలగించాలని పట్టుదలగా ఉన్నారు. కీలక శాఖల బాధ్యతలపై ఆయన దృష్టి సారించనున్నారు. పాలనను సమర్థవంతంగా పట్టాలెక్కించడానికి మార్పులు అవసరమని ఆయన నమ్ముతున్నప్పటికీ, ఇది పార్టీలో అంతర్గత అలజడికి దారితీసే ప్రమాదం ఉంది. సీనియర్లను కాదని ఇతరులకు అవకాశం ఇస్తే, ఆ అసంతృప్తి జ్వాలలు గాంధీ భవన్లో రాజకీయ ముసలానికి దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్ ఈ అలజడిని కంట్రోల్ చేయలేకపోతే, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కంటే కాంగ్రెస్ ‘కుమ్ములాటల వార్తలే మీడియాలో హైలైట్ అయ్యే ప్రమాదం ఉంది.
పదవుల కోసం భారీ ఒత్తిడి
ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఒత్తిడి రేవంత్ రెడ్డిపై ఎక్కువగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి సీనియర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రేవంత్ ఈ ప్రక్షాళన ద్వారా పార్టీపై తన పూర్తి పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. తనకిష్టమైన వారికి, చురుగ్గా ఉండేవారికి కేబినెట్లో చోటు కల్పించగలిగితే, ఇక పార్టీలో తనకు ఎదురులేదని నిరూపించుకోవచ్చనేది ఆయన ఎత్తుగడ. అయితే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దలు ఈ విషయంలో ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది సస్పెన్స్‌గానే ఉంది.
మార్పు చేర్పులు అగ్నిపరీక్షే
ఈ మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డికి ఒక పెద్ద అగ్నిపరీక్ష వంటిదే. ఒకవైపు పాలనను మెరుగుపరచడం, మరోవైపు పార్టీలోని గ్రూపు రాజకీయాలను సమన్వయం చేయడం ఆయన ముందున్న సవాలు. ఏ మాత్రం తేడా వచ్చినా పాలన పక్కకు పోయి, కేవలం పదవుల గొడవే ప్రధాన చర్చగా మారుతుంది. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది కాబట్టి, రేవంత్ చాలా సీరియస్‌గా, ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ నెలాఖరుకల్లా ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
