పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది కేవలం ఒక వర్గం ఓట్లు మాత్రమే కాదు, అది ఒక నిర్ణయాత్మక శక్తి. గత దశాబ్ద కాలంగా మమతా బెనర్జీ అజేయంగా కొనసాగడానికి ఈ 30 శాతం ఓట్లు ఒక పటిష్టమైన కోటలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు సమీకరణాలు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓట్ల ఏకీకరణ అనేది మమతా బెనర్జీకి శ్రీరామరక్షగా ఉంటూ వచ్చింది. 2011 నుండి సీపీఎం ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకున్న దీదీ, బీజేపీ ఎదుగుదలను చూపించి ఆ ఓట్లు ఎక్కడికీ వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ప్రస్తుతం హుమాయున్ కబీర్ లాంటి సొంత పార్టీ తిరుగుబాటు నేతలు, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం వంటి శక్తులు ఈ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించడం తృణమూల్ కాంగ్రెస్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
దీదీని భయపెడుతున్న హుమాయున్ కబీర్
హుమాయున్ కబీర్ వంటి నేతలు ముస్లిం వర్గాల్లో బలమైన పట్టున్న వారు. టిఎంసిలో ఉంటూనే తమ వర్గానికి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పడం ద్వారా, ముస్లిం యువతలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించారు. తరవాత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు. మనం కేవలం ఓటు బ్యాంకుగానే ఉండాలా? మనకంటూ స్వతంత్ర నాయకత్వం వద్దా అనే చర్చ మొదలైతే అది మమతకు పెద్ద దెబ్బే. స్థానిక నేతలు చీలిపోతే, ఆ ప్రభావం నేరుగా కనీసం 60 నుండి 80 అసెంబ్లీ స్థానాలపై పడుతుంది. ఒవైసీ బెంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఓట్ల చీలికేనని టిఎంసి ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. మజ్లిస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానికంటే, ఎన్ని ఓట్లు చీలుస్తుంది అనేదే ఇక్కడ ముఖ్యం. ముస్లిం ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్ వంటి జిల్లాల్లో మజ్లిస్ చీల్చే ప్రతి ఓటు పరోక్షంగా బీజేపీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. దీనినే రాజకీయ పరిభాషలో స్ప్లిట్ ఓట్ స్ట్రాటజీ అంటారు.
బీజేపీ బూచి పనిచేస్తుందా
ఇప్పటివరకు మమతా బెనర్జీ నేను కాకపోతే బీజేపీ వస్తుంది, మీ రక్షణ నా బాధ్యత అనే నినాదంతో ముస్లింలను తనవైపు తిప్పుకున్నారు. కానీ, అభివృద్ధి ఫలాలు అందకపోవడం, నిరుద్యోగం వంటి అంశాలు ఇప్పుడు ఆ వర్గాల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ఒకవేళ ముస్లింలు బీజేపీ ఎలాగూ గెలవదు అని భావిస్తే మాత్రం ఓట్ల చీలిక అనివార్యం. అందుకే మమతా బెనర్జీ పార్టీ నేతలకు టెన్షన్ ప్రారంభమయింది.
మమత ఓటమికి ఇది దారితీస్తుందా?
బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఒక వైపే ఉండాలి. ఒకవేళ హుమాయున్ కబీర్, మజ్లిస్ ప్రభావంతో ఆ 30 శాతం ఓట్లలో 5 నుండి 10 శాతం చీలిక వచ్చినా, అది తృణమూల్ ప్రభుత్వ పతనానికి దారితీసే అవకాశం ఉంది. హిందూ ఓట్లు ఇప్పటికే మెజారిటీ మేర బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, మమతకు ఉన్న ఏకైక ఆశాకిరణం ముస్లిం ఓటు బ్యాంకే. ఆ కోట గనుక కూలితే, బెంగాల్ పీఠంపై మార్పు ఖాయం.
