తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక రాష్ట్ర స్థాయి నేతగా మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో పార్టీకి ఒక బలమైన వ్యూహకర్త గా ఎదుగుతున్నారు. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే, పార్టీ విధాన నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ..బీజేపీని కంగారు పెట్టారు. తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థిని తానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ అంశంలో.. ఉత్తరాదికి కోపం రాకుండా.. దక్షిణాది వాదన వినిపించేందుకు హైబ్రీడ్ మోడల్ ను తెరపైకి తెచ్చి చర్చ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వ్యూహాలు చాలా సమస్యలను పరిష్కరించేలా చేస్తున్నాయి.
ఎజెండా సెట్టింగ్‌లో రేవంత్ మార్క్
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన , దూకుడుతో కూడిన ఎజెండాను రేవంత్ అందిస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, బీజేపీ అమలు చేస్తున్న ఎజెండాను ధీటుగా ఎదుర్కొనేలా రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బీజేపీని నిలువరించడంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఏఐసీసీ పెద్దలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
హైబ్రిడ్ మోడల్- కాంగ్రెస్ సమస్యకు పరిష్కారం
ఇక రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ప్రతిపాదించి హైబ్రీడ్ మోడల్ కాంగ్రెస్ పార్టీ అధికార విధానంగా ప్రచారం పొందుతోంది. గతంలో కాంగ్రెస్‌లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు రేవంత్ విషయంలో పరిస్థితి మారింది. రేవంత్ ఇచ్చే సలహాలను, విశ్లేషణలను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు ఎంతో సీరియస్‌గా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా పంపుతుండటమే ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనం.
రేంజ్ కు గోల్డెన్ పీరియడ్
ప్రస్తుతం రేవంత్ రెడ్డికి రాజకీయంగా అన్నీ కలిసొస్తున్న కాలం నడుస్తోంది. అటు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదగడం, ఇటు కేంద్రంలో మోదీ సర్కార్‌ను విమర్శించే గొంతుకగా మారడం ఆయనను జాతీయ స్థాయి నేతగా నిలబెట్టాయి. ప్రతిపక్షాల ఐక్యతలోనూ, బీజేపీ వ్యతిరేక కూటమిలోనూ ఆయన ఒక కీలకమైన థింక్ ట్యాంక్ గా తన ముద్ర వేస్తున్నారు. పనితీరుతో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన ఆస్తిగా మారారు. ఆయన రాజకీయ వ్యూహాలు భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.


