రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. అనకాబల్లి జిల్లా రాంబిల్లి మండలం జెడ్. చింతువ సమీపంలోని గజిరెడ్డిపాలెం వద్ద రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్ , హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టుకు చంద్రబాబు భూమి పూజ చేశారు. సుమారు రూ. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్, రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగంలో నూతన శకానికి నాంది పలకనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. సోలార్ ప్యానెళ్ల తయారీలో ఇవి అత్యంత కీలకమైన భాగాలు. వీటితో పాటు, ఈ ప్లాంట్‌కు అవసరమైన విద్యుత్ కోసం రూ. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టును కూడా సంస్థ నిర్మిస్తోంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024′ కింద రాబోతున్న ఈ మెగా ప్రాజెక్టు, సోలార్ సప్లై చైన్‌లో విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, దేశీయ తయారీ రంగానికి పెద్ద పీట వేయనుంది.
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా సుమారు 2,100 మందికి నేరుగా , పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాబోయే 24 నెలల్లోనే ఈ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. కుదిరిన ఒప్పందాలను ఆచరణలోకి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఈ పర్యటన ద్వారా స్పష్టమైంది. రెన్యూ ఎనర్జీ సంస్థ రాష్ట్రంలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండటం విశేషం. కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా మరింత బలోపేతం కానుంది.
