లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ , సీఐడీ , ఈడీ జరుపుతున్న దాడులు, ఆస్తుల జప్తులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన వేల కోట్ల కుంభకోణం మూలాలు ఇప్పుడు హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ , వినోద రంగాల వరకు వ్యాపించాయి. ఈడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్, తిరుపతిలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు, విచారణలు జోరుగా సాగుతున్నాయి కానీ అసలు సూత్రధారి దొరికేదెప్పుడు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.
కుంభకోణం తీవ్రత – వందల కోట్ల జప్తు
మద్యం కుంభకోణం విలువ సుమారు 3,500 కోట్ల నుండి 4,000 కోట్ల వరకు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈడీ 441 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు , భారీ ఎత్తున భూములు ఉన్నాయి. తాజాగా జరిగిన సోదాల్లో నూ భారీగా లావాదేవీలను గుర్తించారు. మద్యం సిండికేట్ నెలకు రూ.100 కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆర్జించిందని, ఈ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోకి మళ్లించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
జగన్ సలహాదారు హోదాలో కేసిరెడ్డిదే ప్రధాన పాత్ర
ఈ మొత్తం స్కామ్‌కు మాజీ ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా పనిచేసిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. మద్యం సేకరణ ప్రక్రియను మ్యాన్యువల్ పద్ధతిలోకి మార్చి, కొన్ని బ్రాండ్లకు మాత్రమే లాభం చేకూర్చేలా ఆయన చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాదాపు రూ.1,048 కోట్ల కిక్‌బ్యాక్‌లు చేతులు మారాయని ఈడీ తన విచారణలో వెల్లడించింది.
అసలు సూత్రధారి వైపు అడుగులేవి?
దర్యాప్తు సంస్థలు రాజ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి , ధనుంజయ్ రెడ్డి వంటి వారిపై దాడులు చేస్తున్నప్పటికీ, అసలు పెద్ద తలకాయ” వరనే ప్రశ్న వినిపిస్తోంది. నిన్నటి సోదాల్లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారి ఇళ్లపై దాడులు జరగడం చూస్తుంటే, విచారణ నెమ్మదిగా రాజకీయ అధినాయకత్వం వైపు మళ్లుతోందన్న సంకేతాలు అందుతున్నాయి. అయినప్పటికీ, ప్రధాన రాజకీయ నాయకులను నేరుగా విచారించడానికి పక్కా ఆధారాల కోసం ఏజెన్సీలు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
డబ్బు ఎక్కడికి చేరింది?
లిక్కర్ సిండికేట్ వసూలు చేసిన నగదును హైదరాబాద్‌లోని వివిధ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి, అక్కడి నుండి క్యాష్ హ్యాండ్లర్స్ ద్వారా ప్రధాన సూత్రధారికి చేర్చినట్లు ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. హవాలా మార్గంలో విదేశాలకు నిధుల మళ్లింపు కూడా జరిగినట్లు అనుమానిస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా కింద స్థాయి అధికారులకు వాటాలు పంపిణీ చేసి, సింహభాగం మాత్రం పైస్థాయి కి చేరిందని, దానికి సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు ,ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ రికార్డులు ఇప్పుడు దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నాయని చెబుతున్నారు.
చట్టం తన పని తాను చేస్తోందా?
ప్రస్తుతానికి విచారణ కేవలం అధికారుల చుట్టూ, బినామీల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా, ఈడీ , సిట్ సేకరిస్తున్న ఆధారాలు అంతిమంగా ఒక బలమైన రాజకీయ వ్యక్తిని చుట్టుముట్టే అవకాశం ఉంది. చట్టబద్ధమైన ఆధారాలే కీలకం కాబట్టి, ఏజెన్సీలు అడుగులు ఆచితూచి వేస్తున్నాయి. అయితే ఎప్పటికి దగ్గరకు చేరుకుంటారన్నది మాత్రం అంతు చిక్కడం లేదు.
