విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అనకాపల్లి జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రాకను ఏపీ చరిత్రలో ‘గేమ్ చేంజర్’గా అభివర్ణించిన సీఎం, రాబోయే రోజుల్లో విశాఖ నగరం గ్లోబల్ ఏఐ గేట్వేగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని ఆయన ఆకాంక్షించారు.
15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
2026 ఏప్రిల్ 28వ తేదీ భారత సాంకేతిక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి అన్నారు. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్‌ను నిర్మిస్తే అది నేడు సంపద సృష్టికి కేంద్రమైంది. ఇప్పుడు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏపీని ప్రపంచ పటంలో నిలబెడుతుంది అని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఏదైనా కావాలంటే గూగుల్‌లో వెతుకుతుందని, కానీ గూగుల్ సంస్థే స్వయంగా ఏపీని వెతుక్కుంటూ రావడం మన రాష్ట్ర గౌరవాన్ని పెంచిందన్నారు.
అనకాపల్లి.. మరో రంగారెడ్డి జిల్లా!
పారిశ్రామిక అభివృద్ధి పరంగా అనకాపల్లి జిల్లా భవిష్యత్తులో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాను తలపిస్తుందని చంద్రబాబు అంచనా వేశారు. అదానీ గ్రూప్, ఎయిర్టెల్ వంటి దిగ్గజాల సహకారంతో గూగుల్ డేటా సెంటర్ పనులు శరవేగంగా జరుగుతాయని, 2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాలని ఆయన లక్ష్యాన్ని నిర్దేశించారు. విశాఖకు నీటి సమస్య లేకుండా కేవలం 60 రోజుల్లోనే గోదావరి జలాలను తరలిస్తామని, గూగుల్ ఏఐ హబ్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్రలో వలసలకు చెక్ – ఐటీ టాలెంట్ హబ్
ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం గుర్తుకొచ్చేవని, కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదని సీఎం స్పష్టం చేశారు. “ట్యాలెంట్ మైగ్రేషన్ ముగిసింది.. ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారు” అని ఆయన ప్రకటించారు. వచ్చే జూలైలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి ఎగుమతులు మొదలవుతాయని వివరించారు. రాష్ట్రానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం మన స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ కు నిదర్శనమని గర్వంగా చెప్పారు.
రైల్వే జోన్ నోటిఫికేషన్.. సుపరిపాలనలో ఏఐ!
విశాఖ వాసుల చిరకాల స్వప్నమైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు సంబంధించి జూన్ 1వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించి హర్షధ్వానాలు అందుకున్నారు. బులెట్ ట్రైన్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామన్నారు. కేవలం పరిశ్రమలకే కాకుండా, ప్రభుత్వ పాలనలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామని, తన కార్యాలయంలోని కార్యదర్శులతో పాటు ఒక ‘ఏఐ అసిస్టెంట్’ కూడా సుపరిపాలన అందించడంలో తనకు తోడ్పడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి ప్రాజెక్టుల కాలపరిమితి
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 90 గిగావాట్ల ఉత్పత్తికి ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని, రెన్యూ పవర్ ద్వారా ఇంగాట్ సోలార్ వేఫర్స్ ఉత్పత్తి కూడా త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. ఒప్పందాలు చేసుకోవడమే కాదు, వాటిని క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ చేయడంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందని చెబుతూ, వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రసంగాన్ని ముగించారు.
