ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతికత సెకన్ల వ్యవధిలో మారుతోంది. ఈ వేగాన్ని అందుకోవాలంటే మన పాఠ్యాంశాలు కూడా మారాలన్నది మంత్రి నారా లోకేష్ బలమైన ఆకాంక్ష. అందుకే ఆయన ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పాఠ్యాంశాల పునర్నిర్మాణం చేపట్టారు. కేవలం థియరీ చదువులకే పరిమితం కాకుండా, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, లాజిస్టిక్స్ వంటి గేమ్ ఛేంజర్ రంగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం లోకేష్ విజన్‌కు అద్దం పడుతోంది. ఎన్సీఈఆర్టీ , ఐఐటీ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో ఈ కోర్సులను రూపొందిస్తున్నారు.
యూనివర్సిటీలు ఇక పరిశోధన కేంద్రాలు
విశ్వవిద్యాలయాలు కేవలం పరీక్షలు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదని, అవి ఆవిష్కరణలకు నిలయాలుగా మారాలని భావిస్తున్నారు. ప్రతీ యూనివర్సిటీని ఒక పారిశ్రామిక సంస్థతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు చదువుతో పాటే ప్రాక్టికల్ అనుభవం లభిస్తుంది. అంతేకాకుండా, ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలన్న లక్ష్యం ఏపీ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా తీర్చిదిద్దుతుంది. జర్మన్ వంటి విదేశీ భాషా విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా మన యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలను మరింత చేరువ చేస్తున్నారు.
నైపుణ్యాభివృద్ధి – 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించి ఉద్యోగాలు ఇప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. దీని కోసం ర్యాండమ్ స్కిల్ ఆడిట్, స్కిల్ గ్యాప్ అడ్వైజర్ల ను ఏర్పాటు చేయడం అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అభివృద్ధి చేయడం, జిల్లాల వారీగా స్కిల్ మ్యాపింగ్ చేయడం ద్వారా ఎక్కడ ఏ నిపుణుల అవసరం ఉందో సులభంగా తెలుస్తుంది. గడచిన 22 నెలల్లోనే 7 లక్షల మందికి ఉపాధి లభించిందన్న గణాంకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల సత్ఫలితాలకు నిదర్శనం.
మధ్యాహ్న భోజనం నుంచి ఐఏఐ కాన్ఫరెన్స్ వరకు
విద్యార్థుల మేధస్సుతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యమని నారా లోకేష్ నమ్మకం. పోషకాలతో కూడిన మెనూ, కిచెన్ గార్డెన్లు, మరియు డిజిటల్ బోధన ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నారు. త్వరలో నిర్వహించబోయే స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలకు వేదిక కానుంది. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండటం, మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి చిన్న అంశాల నుంచి ఏఐ వంటి పెద్ద అంశాల వరకు ప్రతిదీ లోకేష్ పర్యవేక్షణలో మారుతుండటం ఏపీ విద్యా రంగంలో ఒక స్వర్ణయుగానికి సంకేతం. నారా లోకేష్ కేవలం మంత్రిగా కాకుండా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఏపీ యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. కాలానికి అనుగుణంగా విద్య మారకపోతే యువత వెనుకబడిపోతారన్న ఆయన ఆలోచనే నేడు ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో దేశానికే దిక్సూచిగా నిలబెడుతోంది.
