తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం రాష్ట్రాల అధికార మార్పిడికే పరిమితం కాదు. ఈ ఫలితాల సెగ ఇప్పుడు నేరుగా దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దల సభ కు తాకనుంది. రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన డీఎంకే , తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. అందులో భాగంగా తమ రాజ్యసభ సభ్యులను బీజేపీకి సమర్పించుకోవాల్సిన గడ్డు పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. గతంలో అనేక ప్రాంతీయ పార్టీలు అనుసరించిన శరణాగతి రాజకీయాన్నే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా అనుసరించక తప్పకపోవచ్చు.
తగ్గిపోయిన డీఎంకే , టీఎంసీల బలం
ప్రస్తుతం రాజ్యసభలో డీఎంకేకు 10 మంది సభ్యులు ఉండగా, తృణమూల్ కాంగ్రెస్కు 13 మంది సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలలో సంఖ్యా బలం కోల్పోవడంతో, రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తమ సొంత బలంతో సభ్యులను గెలిపించుకోలేవు. ముఖ్యంగా బెంగాల్లో దాదాపు 4-5 సీట్లు, తమిళనాడులో 3-4 సీట్లు ఈ పార్టీల చేజారి బీజేపీ లేదా ఇతర గెలిచిన పార్టీల ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్య పద్దతి. కానీ బీజేపీ విలీన మార్గాన్ని ఎంచుకుంటోంది. ఇటీవల ఆప్ రాజ్యసభ సభ్యులను విలీనం చేసుకున్నారు. అలా ఈ రెండు పార్టీల రాజ్యసభ సభ్యులపైనా వల విసరవచ్చు. డీఎంకే సంగతేమో కానీ.. బెంగాల్ రాజ్యసభసభ్యులు మాత్రం విలీనం ఖాయమనుకోవచ్చు.
కాపాడుకోవడానికి సమర్పణ రాజకీయం
రాజకీయాల్లో ఇది కొత్తేమీ కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొంతమంది సభ్యులు తమ ఉనికి కోసం బీజేపీ వైపు చూశారు. ఇప్పుడు స్టాలిన్ , మమత కూడా తమ పార్టీ నేతలపై ఉన్న కేసులు, రాజకీయ వేధింపుల నుంచి ఉపశమనం పొందాలంటే.. తమ రాజ్యసభ సభ్యులను బీజేపీకి మద్దతుగా పంపడం లేదా వారిని బీజేపీలో చేర్చుకోవడానికి మౌనంగా అంగీకరించడం మినహా మరో మార్గం లేదని అనుకోవచ్చు.
బీజేపీకి ఎందుకు అవసరం?
కేంద్రంలో ఎన్డీయే కూటమికి రాజ్యసభలో మెజారిటీ మార్కు కు చేరువలో ఉన్నప్పటికీ, రాజ్యాంగసవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఇంకా కొన్ని సీట్ల అవసరం ఉంది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడులో వచ్చిన అసెంబ్లీ ఫలితాల ద్వారా బీజేపీకి కనీసం 10 నుండి 12 రాజ్యసభ సీట్లు అదనంగా దక్కే అవకాశం ఉంది. డీఎంకే, టీఎంసీల ఓటమితో రాజకీయం చేసి బీజేపీ వారి సభ్యులను తన ఖాతాలో వేసుకుంటే, ఎగువ సభలో కూడా ఆ పార్టీకి తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది.
ముందున్నది గడ్డు కాలమే!
ఒకవేళ ఈ ప్రాంతీయ పార్టీలు రాజ్యసభ సభ్యుల విషయంలో బీజేపీతో రాజీ పడకపోతే, కేంద్రం నుంచి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీల అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం పోయినప్పుడు రాజ్యసభ సభ్యులే ప్రాంతీయ పార్టీలకు రక్షణ కవచాలుగా మారుతున్నారు. ఇప్పుడు డీఎంకే, టీఎంసీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పరోక్షంగా బీజేపీకి సహకరించక తప్పని పరిస్థితి. అదే రాజకీయం అనుకోవచ్చు.
