ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలు పొదుపు పాటించాలని ఏడు అప్పీల్స్ చేశారు. వాటిని జాతీయ మిషన్‌గా ప్రకటించారు. వీటికి వ్యతిరేకంగా వైసీపీ కామెంట్లు చేస్తోంది. గతంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సై అన్న జగన్, ఇప్పుడు నేరుగా మోదీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు రూటు మార్చింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ పొదుపు మంత్రాన్ని బోధిస్తే, దాన్ని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. పార్టీ ఆఫీసులో కూర్చుని మరీ ప్రెస్ మీట్ పెట్టించారంటే, బీజేపీతో మైత్రికి వైసీపీ స్వస్తి పలుకుతోందన్న సంకేతం బలంగా వెళ్తోంది.
తమిళనాడు మలుపు.. విజయ్ – రాహుల్ స్నేహం!
తమిళనాడులో అద్భుత విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు విజయ్ పట్ల సాక్షి మీడియా చూపిస్తున్న అమితమైన ప్రాధాన్యత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ గెలుపును ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ, ఆయనకు రాహుల్ గాంధీతో ఉన్న పాత స్నేహాన్ని సాక్షి హైలైట్ చేస్తోంది. తమిళనాడులో విజయ్ – కాంగ్రెస్ కూటమి మాదిరిగా, ఏపీలో కూడా ఒక కొత్త సమీకరణం కోసం జగన్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. విజయ్ , రాహుల్ గాంధీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ని సాక్షి విపరీతంగా ప్రచారం చేయడం వెనుక, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు మానసికంగా కేడర్‌ను సిద్ధం చేసే వ్యూహం దాగి ఉంది.
కాంగ్రెస్ అడ్వాంటేజ్.. ఏపీలో రివర్స్ గేమ్?
వైసీపీ – కాంగ్రెస్ చేతులు కలిపితే ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా తలకిందులవుతాయి. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని ఎదుర్కోవాలంటే కేంద్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న కాంగ్రెస్ మద్దతు జగన్‌కు అవసరం. అందుకే, మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శించడం ద్వారా తాను బీజేపీకి దూరం అయ్యానని, కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నానని జగన్ మెల్లగా సంకేతాలు పంపుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను ప్రజలపై రుద్దడం కంటే, మోదీ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి గొంతుకను జగన్ వినిపించాలనుకుంటున్నారని అనుకోవచ్చు.
మోదీపై దాడి.. ఇక నిరంతరం?
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఇప్పటికే జగన్ ప్రధానికి లేఖ రాశారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. ఈ పాయింట్‌తో పాటు మోదీ వ్యక్తిగత ప్రయాణ ఖర్చులు, ఏడు సూత్రాల పొదుపు మంత్రం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని రాబోయే రోజుల్లో వైసీపీ మరింత జోరుగా విమర్శలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో జట్టు కట్టడం ఖాయమైతే, మోదీపై వైసీపీ చేసే విమర్శలు మరింత ఘాటుగా మారనున్నాయి. ఏపీ రాజకీయాల్లో పాత స్నేహాలు పోయి, కొత్త పొత్తుల పర్వం మొదలైందని పేర్ని నాని వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.
