ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు ఏపీ ప్రభుత్వం తరపున ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. జూన్ 2 నుండి 7 వరకు జరిగే ఈ ఉన్నత స్థాయి సదస్సులో పాల్గొని, నవ్యాంధ్ర పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పేందుకు మంత్రి లోకేశ్ సిద్ధమయ్యారు.
ఆరు రోజుల రష్యా పర్యటనలో మంత్రి లోకేశ్ అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. సదస్సుకు హాజరయ్యే అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఆయన ప్రత్యేకంగా వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి కల్పిస్తున్న వెసులుబాట్లు, సింగిల్ విండో అనుమతులు, మరియు అనుకూలమైన వాతావరణాన్ని వారికి వివరించి, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయన అధికారికంగా ఆహ్వానించనున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యంగా ఐటీ , ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఉన్నత విద్యా రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఏపీని దేశంలోనే నెంబర్ వన్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం కాగా.. దానికి అనుగుణంగానే అంతర్జాతీయ సాంకేతిక సంస్థలను, పరిశోధనా కేంద్రాలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు లోకేశ్ వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. అంతే కాకుండా, గ్లోబల్ యూనివర్సిటీలతో ఏపీ విద్యాసంస్థల అనుసంధానానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించనున్నారు.
గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు యువతకు ఉపాధి కల్పించడమే పరమావధిగా పెట్టుకున్న నారా లోకేశ్ చేపట్టిన ఈ రష్యా పర్యటనపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తులు ఒకే వేదికపైకి వచ్చే ఈ SPIEF సదస్సు ద్వారా ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు, సాంకేతికత తరలివచ్చే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.
