ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఈ వారం కొత్తపకులుకులో ఎందుకో ప్రధాని మోదీ భజన చేయాలనుకున్నారు. దానికి కారణం ఏమిటో తెలియదు కానీ ఆయన ఓ రేంజ్ లో చేసేశారు. బాహుబలి ఎలివేషన్లు సినిమాల్లో ఎలా బెంచ్ మార్క్ గా ఉంటాయో…. మోదీ గురించి ఆర్కే అలాంటి ఎలివేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ చదివేవారికి ఇదంతా ఇప్పుడు ఎందుకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఆ విషయం ఆర్కేకు మాత్రమే తెలుసు.
శ్రీశ్రీతో పోలిక పెట్టి పోలిక ప్రారంభించడమే కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇంకెవరైనా ప్రపంచంలో ప్రజల్ని మెప్పించిన రాజకీయ నేతతో పోలిక పెడితే సరిపోయేది. అక్కడ్నుంచి ప్రారంభించి మోదీ గురించి చివరి వరకూ ఆపకుండా.. పొగుడుతూనే పోయారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలు సగం జమిలీగా జరుగుతాయని ఆ తర్వాత కంప్లీట్ గా జమిలీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అప్పటి వరకూ ప్రధానిగా మోదీ ఉంటారని జోస్యం చెప్పారు. 90 ఏళ్లు వచ్చే వరకూ మోదీ ప్రధానిగా ఉంటారట.
ప్రాంతీయ పార్టీలనుపూర్తిగా నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని.. ఉంటే గింటే బీజేపీకి తోక పార్టీలుగా ఉంటాయని ఆర్కే చెబుతున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే కేసీఆర్ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిపోతున్నారని.. కానీ బీజేపీ మాత్రం పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ప్రధాని మోదీని తక్కువ అంచనా వేయలేదని.. చిన్న చిన్న రాజకీయ పరిణామాలనుకూడా చాలా సీరియస్ గా తీసుకుంటారని ఆర్కే చెబుతున్నారు.
ఆర్కే చెప్పిన దాని ప్రకారం ఇంకా మూడేళ్ల సమయం ఉంది. దేశానికి సంబంధం లేకపోయినా యుద్ధ ప్రభావం దేశంపై ఎక్కువగా ఉంది. ట్రంప్ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఇంకా పెరిగితే ప్రజల్లో ఆగ్రహం వస్తుంది. ఇలాంటి సమయంలో మోదీకి భజన చేయాల్సినంత అవసరం ఆర్కేకు ఏం కనిపించిందో ఆయనకే తెలియాలి. మొత్తంగా ఈ వారం కథనంతో మోదీ గుడ్ లుక్స్ లో ఆర్కే పడతారని అనుకోవచ్చు.

