అసెంబ్లీకి వెళ్ల‌డానికి మ‌న‌సు రావ‌ట్లేద‌ట‌..!

గడచిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైకాపా బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఫిరాయింపు నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేవ‌ర‌కూ అసెంబ్లీకి వ‌చ్చేది లేద‌ని జగన్ తేల్చి చెప్పేశారు. అయితే, అస‌లు కార‌ణం ఆయన త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర అనేది అంద‌రికీ తెలిసిందే..! ఆయ‌న యాత్ర చేస్తుంటే, ఇత‌ర ఏర్పాట్లు చేయ‌డానికి నాయ‌కులు అందుబాటులో ఉండాలి కాబ‌ట్టి, ‘జంప్ జిలానీ నేత‌ల‌పై పోరాటం’ అనే అంశాన్ని హ‌టాత్తుగా భుజానికి ఎత్తేసుకున్నారు. ఆ త‌రువాత‌, ఆ పోరాటం ఎటెళ్లిందో తెలీదు..! స‌రే, మార్చి 5 నుంచి ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 5న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది, 8న రాష్ట్ర ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు. క‌నీసం ఈ స‌మావేశాల‌కైనా వైకాపా ఎమ్మెల్యేలు హాజ‌రు అవుతారా లేదా అనే చ‌ర్చ మొద‌లైంది..!

నిజానికి, అసెంబ్లీ గ‌త స‌మావేశాల బ‌హిష్క‌ర‌ణ స‌మ‌యంలో వైకాపా నుంచి భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సమావేశాల బహిష్కరణ స‌రైన నిర్ణ‌యం కాద‌ని కొంత‌మంది వైకాపా ఎమ్మెల్యేలు అభిప్రాయం అన్న‌ట్టుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌క‌పోతే ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌నీ, గ‌త స‌మావేశాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చిన కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం, పోల‌వ‌రంపై ఆ స‌మ‌యంలో కేంద్రం పెట్టిన కొర్రీలు.. ఇలాంటివాటిపై మాట్లాడే అవ‌కాశాన్ని వైకాపా వ‌దులుకున్న‌ట్ట‌యింది. దీంతో జ‌గ‌న్ కాస్త పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌నీ, పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చైనాస‌రే బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వ‌స్తార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ, ప్ర‌స్తుతం జ‌గ‌న్ తీరు చూస్తుంటే… ఈ బ‌డ్జెట్ స‌మావేశాలకు గైర్హాజ‌రు అయ్యేందుకు కూడా ఓ కార‌ణం వెతుక్కున్నారనే అనిపిస్తోంది.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో జ‌గ‌న్ మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లాలంటే మ‌న‌సు రావ‌డం లేద‌ని అన్నారు. చ‌ట్ట‌స‌భ‌లు చేసిన చ‌ట్టాలు ఈ పాల‌న‌లో అమ‌లు కావ‌డం లేద‌ని ఆరోపించారు. చ‌ట్టాల‌ను అవ‌హేళ‌న చేస్తున్న ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఉంద‌నీ, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల‌కి ప‌ద‌వులు ఇవ్వ‌డం గ‌తంలో ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లే ధైర్యం అధికార పార్టీకి లేదన్నారు. సో.. జ‌గ‌న్ కి ఇప్ప‌టికీ అసెంబ్లీకి రావాలంటే మ‌న‌సు రావ‌ట్లేద‌ట‌! ఆయ‌న తీరు చూస్తుంటే బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కూడా వైకాపా స‌భ్యుల రాక అనుమానంగానే క‌నిపిస్తోంది. అయితే, ఈ నిర్ణ‌యంపై ఆ పార్టీ నేత‌ల్లో భిన్నాభిప్రాయాలు గ‌తంలోనే వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ, ఈసారి కూడా జ‌గ‌న్ డిసైడ్ చేసేశారేమో అనిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా స‌మ‌స్య ఉంది, ఫిరాయింపు ఎమ్మెల్యేల బేర‌సారాల‌కు సంబంధించి ఆధారాలు కూడా వైకాపా ద‌గ్గ‌ర ఉన్నాయి… స‌భ‌కు వ‌స్తే చాలా మాట్లాడొచ్చు క‌దా! అయినా, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లడానికి మనసు రావట్లేదని అంటారేంటండీ..? ప్రజలు వాళ్లకిచ్చిన బాధ్యత అది. అంతేగానీ, వాళ్ల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా చట్టసభలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాలు ఉంటాయా చెప్పండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.