తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల రేపట్నుంచీ (ఫిబ్ర‌వ‌రి 26) నుంచి బ‌స్సు యాత్ర‌కు బ‌య‌లుదేరుతున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్లోగానే ఎన్నిక‌లు వ‌చ్చేస్తాన్న‌ది వారి గ‌ట్టి న‌మ్మ‌కం! అందుకే, ఇప్ప‌ట్నుంచీ ప్ర‌జ‌ల్లో ఉండాల‌నీ, కార్య‌క‌ర్త‌ల్లో ఊపు త‌గ్గ‌కుండా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌నీ, బ‌స్సుయాత్ర అయిన వెంట‌నే పాద‌యాత్ర‌లు చేయాల‌ని షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్నారు. చేవెళ్ల నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌స్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నియోజ‌క వ‌ర్గం చేవెళ్ల కావ‌డంతో యాత్ర ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ ఆమె చూస్తున్నారు. ముందుగా చేవెళ్ల‌లో బ‌హిరంగ స‌భ‌, ఆ త‌రువాత బ‌స్సుయాత్ర ప్రారంభం ఉంటాయి.

ఈ యాత్ర‌ను విజ‌య‌వంతం చేసే దిశ‌గా అంద‌ర్నీ స‌మ‌న్వ‌య ప‌రిచేందుకు కొన్ని క‌మిటీల‌ను పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వేశారు. ప్రజా చైత‌న్య యాత్ర స‌ల‌హా సంఘం ప్రెసిడెంట్ బాధ్య‌త‌ల్ని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్కకు ఇచ్చారు. ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ గా గూడూరు నారాయ‌ణ రెడ్డి, ఆర్గ‌నైజింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ గా ష‌బ్బీర్ అలీని నియ‌మించారు. అయితే, ఈ క‌మిటీల్లో మ‌రికొంతమంది కీల‌క నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని అనుకుంటే.. వారి పేర్ల ప్ర‌స్థావ‌న కూడా లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది..! ముఖ్యంగా కోమ‌టి రెడ్డి సోద‌రులకు ఈ క‌మిటీల్లో అవ‌కాశం ద‌క్క‌లేదు. నిజానికి, పార్టీ త‌ర‌ఫున పాద‌యాత్ర‌లు చేస్తామ‌ని గ‌త ఏడాది నుంచి వారు సిద్ధంగా ఉంటూ వ‌చ్చారు. ఇక‌, పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారంలో కీల‌కపాత్ర పోషిస్తారనుకున్న రేవంత్ రెడ్డి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వ‌చ్చి పార్టీ కోసం ప్ర‌చారం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విజ‌య‌శాంతి పేరు కూడా లేక‌పోవ‌డం విశేషం.

బ‌స్సు యాత్ర ప్రారంభానికి ముందే విజ‌య‌శాంతిని ఆహ్వానిస్తార‌నే చ‌ర్చ జ‌రిగింది. ఈ యాత్ర‌కు విజ‌య‌శాంతి వ‌స్తే, బాగుంటుంద‌నే అభిప్రాయ‌మూ కొంత‌మంది నేత‌ల నుంచి వ్య‌క్త‌మైంది. అయితే, ఆమెకి పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన త‌రువాతే ప్ర‌చారానికి పిలిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలూ వినిపించాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కూ మౌనంగా ఉండాల‌నేదే టీపీసీసీ ఉద్దేశంగా క‌నిపిస్తోంది. ఇక‌, రేవంత్ రెడ్డి విష‌య‌మై కూడా ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. టీడీపీలో ఉండ‌గా ఆయ‌న కీల‌కనేత‌గా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్ లోకి చేరిన త‌రువాత ఆయ‌న‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది త‌ప్ప‌, దానిపై హైక‌మాండ్ నుంచి ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మ‌రి, ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ బ‌స్సు యాత్ర ఎలాంటి ఫ‌లితాల‌ను సాధిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.