విభ‌జ‌న‌ చట్టాన్ని స‌రిగా ‘ఫిక్స్’ చేయ‌లేక‌పోయిందెవ‌రు..?

సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ కేంద్ర‌మంత్రి జైరాం ర‌మేష్ మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు దిగారు! విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతోపాటు, ప్ర‌ధాని మోడీపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరిద్ద‌రూ పార్ల‌మెంటులో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకున్నారు అని ఆరోపించారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదాను అనుభ‌విస్తున్నాయ‌ని, అలాంట‌ప్పుడు ఆంధ్రాకి హోదా ఇవ్వ‌డానికి ప్ర‌ధాని మోడీకి ఉన్న అభ్యంత‌రాలేంటో అర్థం కావ‌డం లేద‌న్నారు. మోడీ, చంద్ర‌బాబుల వ‌ల్ల ఏపీకి ఎలాంటి ఉప‌యోగం లేద‌నీ, దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే ఇప్పుడు నాట‌కాలు ఆడుతున్నార‌న్నారు.

విభ‌జ‌న చ‌ట్టం స‌రిగా లేద‌ని విమ‌ర్శించే చంద్ర‌బాబు, దాన్ని స‌వ‌రించేందుకు గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఎందుకు ప్ర‌య‌త్నించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. విభ‌జ‌న అశాస్త్రీయం అని అంటున్నార‌నీ, అలాంట‌ప్పుడు పార్ల‌మెంటులో స‌వ‌ర‌ణ‌కు టీడీపీ ప్ర‌య‌త్నిస్తే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జైరాం ర‌మేష్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రా ప్ర‌త్యేక హోదాపైనే తొలి సంత‌కం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. హోదా విష‌యంలో 14వ ఆర్థిక సంఘం పేరుతో మోడీ స‌ర్కారు చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాల‌న్నారు.

ఓవారం కింద‌ట, జైరాం రమేష్ రాష్ట్రానికి వచ్చి, ముఖ్య‌మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో విదేశాల్లో చంద్ర‌బాబు ముడుపులు తీసుకున్నార‌నీ, ఆధారాలున్నాయ‌ని తీవ్రంగా ఆరోపించారు. అయితే, వాటిని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం ఆయ‌న చెయ్య‌లేదు. ఇప్పుడు, మోడీ చంద్ర‌బాబుల మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అని మ‌ళ్లీ ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. ఆంధ్రాలో ప్రస్తుత ప‌రిస్థితిని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోనే జైరాం ర‌మేష్ చిత్త‌శుద్ధి ఏపాటిదో క‌నిపిస్తోంది! అంతేత‌ప్ప‌, ఏపీ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చూపించాల‌న్న బాధ్య‌త క‌నిపించ‌డం లేదు. నిజానికి, విభ‌జ‌న చ‌ట్టం రూప‌క‌ల్ప‌నలో కీలక పాత్ర పోషించిందే ఈయ‌న‌..! చ‌ట్టంలో ‘ష‌ల్ ఎగ్జామిన్‌, విల్ అబ్జర్వ్‌, యాజ్ యువ‌ర్ ఫీజిబిలిటీ’ ఇలాంటి ప‌దాల‌ను పెట్టిందే వారు..! ‘మ‌స్ట్ టు, హ్యావ్ టు, రైట్ టు’ అని విభ‌జ‌న చ‌ట్టాన్ని స‌రిగ్గా ‘ఫిక్స్’ చేసి ఉంటే.. భాజ‌పాను బ‌తిమాలుకోవాల్సిన అవ‌స‌రం ఆంధ్రాకి ఉండేదే కాదు. అశాస్త్రీయమైన విభ‌జ‌న చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రా ప్రజల మనోభావాలను తుంగలోకి తొక్కింది వారే. దానికి భారీ మూల్యం చెల్లించుకున్న నాలుగేళ్ల త‌రువాత జైరాం ర‌మేష్ త‌ర‌చూ ఆంధ్రాకి రావడం మొదలుపెట్టారు. విభ‌జ‌న చ‌ట్టం స‌వ‌ర‌ణ చెయ్యొచ్చుగా అని ఇప్పుడు అంటున్నారే, అంటే వారు చేసింది స‌రైంది కాద‌ని చెప్ప‌క‌నే ఒప్పుకుంటున్నట్టా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.