చంద్రబాబు, నితీష్ లేకపోతే మోదీ పదవిలోఉండే వారు కాదని అనేక అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అఖిలేష్ నుంచి సీపీఐ నారాయణ వరకూ ప్రతి రోజూ చెబుతూనే ఉంటారు. చంద్రబాబు శాసించే స్థితిలో ఉన్నారని కాని ఆయన అర్థిస్తున్నారని అంటూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ వల్ల ప్రభుత్వం నిలబడిందని ఎప్పుడూ చెప్పరు. అలాంటి అభిప్రాయం రానివ్వరు. ఎందుకంటే నిజంగానే చంద్రబాబు మీద కేంద్రం ఆధారపడి లేదు.
నెంబర్స్ ప్రకారం చూసినా.. టీడీపీ లేకపోయినా ఎన్డీఏకు నో డేంజర్
లోక్సభలో మొత్తం స్థానాల సంఖ్య 543. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ) 272. బిజెపికి 240 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీయే కూటమి మొత్తం బలం 293 ఎంపీలు. టీడీపీకి ఉన్న ఎంపీ స్థానాలు 16. గణాంకాలను గమనిస్తే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ తన 16 మంది ఎంపీలమద్దతును ఉపసంహరించుకుంటే, కూటమి బలం 277 అవుతుంది. టీడీపీ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన ప్రభుత్వం వెంటనే పడిపోదు. ఎందుకంటే అప్పుడు కూడా కూటమి బలం మెజారిటీ మార్కు కంటే 5 సీట్లు ఎక్కువగా ఉంటుంది.
బీజేపీకి మద్దతు కావాలంటే వెంటపడి ఇచ్చే పార్టీలు ఎన్నో ?
కేంద్ర ప్రభుత్వం పడిపోవాలంటే కేవలం టీడీపీ ఒక్కటే సరిపోదు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా మద్దతు ఉపసంహరించుకోవాలి. ఒకవేళ ఈ రెండు ప్రధాన పార్టీలు ఒకేసారి మద్దతు ఉపసంహరిస్తే, ఎన్డీయే బలం 265కు పడిపోతుందిచ ఇది మెజారిటీ మార్కు కంటే తక్కువ. అప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి, అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.కానీ మోదీకి మద్దతు ఇచ్చి.. కావాల్సిన ప్రయోజనాలు పొందేందుకు చాలా పార్టీలు క్యూలో ఉంటాయి.తాము అధికారికంగా పార్టీ పరంగా మద్దతు ఇవ్వకపోయినా ఎంపీలను పంపించి విలీనం చేయసేయగల తెలివి ఉన్న నేతలున్నారు.
మోదీ కాకపోతే ఇంకెవరు?
బీజేపీ సొంతంగా ఉన్నది 240 సీట్లే అయినా ప్రభుత్వం ఏ మాత్రం బలహీనంగా లేదు. చాలా సులువుగా రాజ్యాంగ సవరణలు కూడా చేసుకోగలిగిన స్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ కంటే బలమైన నేత లేరు. గాంధీ వారసులు తేలిపోయారు. వారు మోదీతో సరితూగడంలేదు. ప్రజలూ నమ్మడం లేదు. కనీసం పేరుకైనా.. కింగ్ మేకర్ అన్న పేరును చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వాటిని విజ్ఞప్తి చేసి అయినా తెచ్చుకుంటున్నారు. తానుకింగ్ మేకర్నన్న అహంకారంతో ఉంటే.. అవికూడా రావు. చంద్రబాబు అలాంటివాటికి దూరంగా ఉంటారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంగా మార్చుకోకుండా వీలైనంత పొలైట్గా ఏపీకి , ప్రజలకు మంచిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
