పాపం పాకీజా అంటూ ఆంధ్రజ్యోతి ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది. అది కూడా మెయిన్ పేజీలో పాకెట్లో పాకీజా అడుక్కుంటోందని ఏడుస్తూ ఫోటో పెట్టి మరీ రాశారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి. ఆంధ్రజ్యోతి ఉద్దేశం కూడా అదే. ఆమె తెలుగు కాదు..తమిళం. కొన్ని సినిమాల్లో తెలుగులో నటించారు. అంత మాత్రాన పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడుతుందా?. ప్రజా ధనంతో వారికి సాయం చేయాల్సిందేనా?
పాకీజా కంటే కష్టాల్లో ఎంతో మంది పేదలు
సినిమాల్లో నటించడం అనేది వారి ఉపాధి. కొన్ని వందలు, వేల మంది నటిస్తారు. బాగుపడిన వారు బాగుపడతారు.. లేని వాళ్లు లేదు. ప్రపంచంలో అన్ని చోట్లా ఇలా ఉంటుంది. కానీ సినిమాల్లో నటించానని తన బాధ్యత ప్రజలదేనని.. ప్రభుత్వాలు సాయం చేయాలని నటించడానికి బయలుదేరితే మాత్రమే సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు నడిచేది ప్రజాధనంతోనే. ఎంతో మంది పాకీజా కంటే పేదలు రాష్ట్రంలో ఉంటారు. వారు సినిమాల్లో నటించకపోయి ఉండవచ్చు.. కాని కష్టాలు పాకీజా కంటే పెద్దవే ఉంటాయి. అలాంటి వారికి ప్రభుత్వాలు సాయం చేయాలి.
సినిమాల్లో నటిస్తే పోషించాల్సింది మీరే అన్నట్లుగా వేషాలు
ఒక్క పాకీజా అంశంలోనే కాదు.. చాలా మంది గతంలో గొప్పగా సినీ ఇండస్ట్రీలో బతికారని ఇప్పుడు చితికిపోయారని.. సాయం ఎవరూ చేయడం లేదని పోస్టులు పెడుతూంటారు. వారు గొప్పగా బతికి చితికిపోతే ఆ తప్పు ప్రజలది ఎందుకు అవుతుంది.. వారి సొమ్ముతో అలాంటి వారికి ఎందుకు సాయం చేయాలి ?. ఒకటి, రెండు సార్లు సాయం చేస్తే సరే అనుకుంటారు కానీ.. పదే పదే తమను పోషించాల్సిన బాధ్యత మీదే అన్నట్లుగా వ్యవహరిస్తూంటారు. వారితోనే సమస్యలు వస్తూంటాయి. ఇలా చాలా మంది బయటకు వస్తున్నారు.
ఎంత సాయం చేసినా మళ్లీ మళ్లీ అదే దీనగాథలు
పాకీజా ఆర్థికపరిస్థితి బాగో లేదని తమిళనాడులో కొంత మంది సాయం చేశారు. యూట్యూబ్ చానళ్లలో ఇంటర్యూలు ఇస్తే మరికొంత మంది సాయం చేశారు. ఇప్పుడు ఆమె ఏపీకి వచ్చి.. పవన్ కల్యాణ్ పేరు వాడేసి.. మీడియా భావ దారిద్ర్యాన్ని వాడుకుని .. మరింత సాయం పొందాలనుకుంటున్నారు. నిజంగా సాయం చేయకపోతే గడవదు అనుకున్న వారికి సాయం చేస్తే తప్పు లేదు..కానీ సినిమాల్లో నటించడమే అడ్వాంటేజ్..మమ్మల్ని పోషించాల్సిందే అనుకునేవారిని మాత్రం అవాయిడ్ చేయాల్సిందే.