తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ ఇప్పుడు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలిసి తప్పు చేసిన ధర్మారెడ్డి, బాలాజీ వంటి వారి కన్నా ఇప్పుడు అక్రమాలు చేయకపోయినా మౌనంగా ఉన్నందుకు సింఘాల్ లాంటి వారికీ శిక్ష తప్పడం లేదు.
జగన్ హయాంలో టీటీడీ నిర్ణయాలన్నీ ఒక గ్యాంగ్ చేతుల్లోనే ఉండేవన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా ధర్మారెడ్డికి అర్హత లేకపోయినా జేఈవోగా నియమించి, ఈవోలను సైతం కాదని ఆయనకే పూర్తి పెత్తనం ఇవ్వడం ద్వారా వ్యవస్థను కుప్పకూల్చారు. శ్రీవారి సేవలో భాగంగా వివాదాలకు దూరంగా ఉండాలనుకున్న అనిల్ కుమార్ సింఘాల్ వంటి అధికారులు, అప్పట్లో ఆధిపత్య వర్గాల నిర్ణయాలను అడ్డుకోలేక మౌనం వహించినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే టీటీడీలో ధర్మారెడ్డి చక్రం తిప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. ఆ సమయంలో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్, తన విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండలేకపోయారని, కేవలం పైస్థాయి ఒత్తిళ్లకే తలొగ్గారని విమర్శలు వస్తున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి టెండర్లు, నాణ్యత పరిశీలన వంటి కీలక అంశాల్లో ధర్మారెడ్డి వర్గం తీసుకున్న నిర్ణయాలకు సింఘాల్ అభ్యంతరం తెలపకపోవడమే ఆయనకు ఇప్పుడు శాపంగా మారింది. వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న జగన్ రెడ్డి గ్యాంగ్ స్వార్థం వల్ల, తప్పు చేయకపోయినా.. తప్పును అడ్డుకోలేదన్న కారణంతో సింఘాల్ వంటి సీనియర్ అధికారులు బలిపశువులయ్యారు.
జగన్ రెడ్డి మార్క్ రాజకీయాల్లో అధికారులకు దక్కే ప్రతిఫలం ఇదేనని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. తన మాట విన్న అధికారులను వాడుకుని, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, చివరకు విచారణలు ఎదురైనప్పుడు వారిని నట్టేట ముంచేయడం తాడేపల్లి వ్యూహం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింఘాల్‌ను మళ్ళీ ఈవోగా నియమించినప్పటికీ, ఇప్పుడు సిట్ నివేదికతో ఆయనను ఆ పదవిలో కొనసాగించే అవకాశం లేదు. సింఘాల్ లాంటి ఐఏఎస్ అధికారుల కెరీర్ పతనం కావడానికి జగన్ రెడ్డి గ్యాంగ్ దుర్మార్గమే ప్రధాన కారణమన్నది స్పష్టమవుతోంది.
