రివ్యూ: యానిమ‌ల్‌

Animal Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 2.5/5

ఒక్క సినిమాతోనే త‌న ముద్ర బ‌లంగా వేసేశాడు సందీప్ రెడ్డి వంగా. రూల్స్ కి విరుద్ధంగా సినిమా తీయ‌డంలో త‌న క‌మాండ్‌, గ‌ట్స్ ఇవ‌న్నీ ‘అర్జున్ రెడ్డి’తోనే బ‌య‌ట‌ప‌డిపోయాయి. హిందీ ‘యానిమ‌ల్‌’ గురించి తెలుగు ప్రేక్ష‌కులు ఇంత‌ ఆస‌క్తిగా ఎదురు చూశారంటే దానికి కార‌ణం… కేవ‌లం సందీప్ రెడ్డి వంగా సినిమా అనే. మ‌రోసారి తాను పాత్ బ్రేకింగ్ సినిమా తీశాడ‌న్న భ‌రోసా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సందీప్ రెడ్డి స్పీచులూ ఇచ్చేశాయ్‌. మ‌రి నిజంగానే ‘యానిమ‌ల్’ పాత్ బ్రేకింగ్ సినిమానా? ఈ సినిమాలోనూ సందీప్ రూల్స్ బ్రేక్ చేశాడా..?

ర‌ణ విజ‌య్ సింగ్ (ర‌ణ‌బీర్ సింగ్‌)కి త‌న తండ్రి బ‌ల్ బీర్ సింగ్‌ (అనిల్ క‌పూర్‌) అంటే చాలా ఇష్టం. బ‌ల్ బీర్ సింగ్ ఓ వ్యాపార వేత్త‌. త‌న ద‌గ్గ‌ర త‌న కుటుంబానికీ, పిల్ల‌ల‌కూ ఇవ్వ‌డానికి టైమ్ ఉండ‌దు. పైగా ర‌ణ విజ‌య్ ప్ర‌వ‌ర్త‌న కూడా అవుటాఫ్ ది బోర్డ్ స్థాయిలో ఉంటుంది. త‌న అక్క‌ని ఎవ‌రో ఏడిపించార‌ని తెలియ‌గానే, కాలేజీకి గ‌న్ ప‌ట్టుకెళ్లి బెదిరిస్తాడు. ఆ కార‌ణంతో కొడుకుని బోర్డింగ్ స్కూల్ కి పంపించేస్తాడు బ‌ల్‌బీర్ సింగ్‌. తిరిగొచ్చాక కూడా ప్ర‌వ‌ర్త‌న మార‌దు. మ‌ళ్లీ ఇంట్లో గొడ‌వ ప‌డి అమెరికా వెళ్లిపోతాడు. కొన్నాళ్ల‌కు బ‌ల్ బీర్ పై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. ఆ విష‌యం తెలియ‌గానే ఇండియా తిరిగొస్తాడు. నాన్న‌ని చంపాల‌నుకొన్న‌వాళ్ల‌ని అంత‌మొందిస్తాన‌ని శ‌ప‌థం పూనుతాడు. మ‌రి… ర‌ణ విజ‌య్ సింగ్ త‌న తండ్రిని కాపాడుకొన్నాడా? శ‌త్రువుల్ని ప‌ట్టుకొన్నాడా? ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ కొడుకుగా ఉండాల‌నుకొన్న త‌న ఆశ‌, ఆశ‌యం నెర‌వేరాయా? ఇదంతా మిగిలిన క‌థ‌.

తండ్రిని అమితంగా ప్రేమించిన ఓ కొడుకు క‌థ ఇది. ‘అర్జున్ రెడ్డి’లోని హీరో ‘అది నా పిల్ల‌రా’ అంటూ హీరోయిన్ పై పిచ్చి ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమ ‘యానిమ‌ల్‌’లో తండ్రికి షిఫ్ట్ అయ్యింది. తండ్రి విష‌యంలో ఎంత దూర‌మైనా వెళ్లే కొడుకు క‌థ‌ని ట‌చ్ చేయ‌డం.. నిజంగా కొత్త పాయింట్‌. అంద‌రికీ ఈజీగా క‌నెక్ట్ అయ్యే పాయింట్‌. దాన్ని సాదాసీదాగా చెప్ప‌కుండా, త‌న స్టైల్ ఆఫ్ ఎమోష‌న్స్ నీ, హై నీ, ఇంటెన్సిటీనీ కూరి కూరి… ‘యానిమ‌ల్గా’ వ‌దిలాడు. సందీప్ రెడ్డి వంగాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌. దాన్ని వీర‌లెవిల్లో ఇంజెక్ట్ చేయ‌డానికి ప్ర‌యత్నిస్తాడు. ‘యానిమ‌ల్‌’లో కూడా అదే కనిపించింది. సీన్ నెంబ‌ర్ వ‌న్ నుంచే.. విజ‌య్ క్యారెక్ట‌ర్‌ని ప్రేక్ష‌కుడి మైండ్ లోకి ఎక్కించే ప‌నిలో ప‌డ్డాడు సందీప్‌. కొంత‌సేప‌టికి ఆ క్యారెక్ట‌ర్ మ‌న‌ల్ని ప‌ట్టేస్తుంది. చివ‌రి వ‌ర‌కూ మ‌న‌ల్ని వ‌దిలి వెళ్లిపోదు. ఈమ‌ధ్య‌లో హీరో ఏం చేసినా న‌చ్చేస్తుంటుంది.

మ‌నిషికీ, జంతువుకీ మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం. విచ‌క్ష‌ణ‌. మ‌న‌లాగే జంతువుల‌కూ ప్రేమ‌లూ, కోపాలూ, ఇష్టాలూ ఉంటాయి. కానీ విచ‌క్ష‌ణ ఉండ‌దు. ఏ ఎమోష‌న్ ని అయినా స‌రే.. విచ‌క్ష‌ణ లేకుండా ప్ర‌దర్శిస్తాయి. జంతువు నుంచి మ‌నిషిని దూరం చేసేది ఆ విచ‌క్ష‌ణే. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కి తండ్రి ప్రేమ విష‌యంలో ఆ విచ‌క్ష‌ణే ఉండుదు. బ‌హుశా.. అందుకే యానిమ‌ల్ అనే పేరు పెట్టారేమో..? దానికి త‌గ్గ‌ట్టుగానే ఆక్యారెక్ట‌ర్ ని డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు.

ద‌ర్శ‌కుడికీ మంచి ద‌ర్శ‌కుడికీ ఓ తేడా ఉంది. ద‌ర్శ‌కులంతా ప్రేక్ష‌కుడి దృష్టి కోణం నుంచి స‌న్నివేశాల్ని ఆలోచిస్తారు. ప్రేక్ష‌కుడి ఊహ‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లి సీన్‌ని ముగిస్తారు. మంచి ద‌ర్శ‌కుడు ఓ స్టెప్ ముందుకెళ్లి, అక్క‌డ ప్రేక్ష‌కుడ్ని కూర్చోబెడ‌తాడు. సందీప్ అయితే.. నాలుగైదు మెట్లు ముందుకెళ్లిపోతాడు. అక్క‌డ ఎడ్జ‌స్ట్ కావ‌డం స‌గ‌టు ప్రేక్ష‌కుడికి చాలా క‌ష్టం అవుతుంది.

అలా త‌న బ్రిలియ‌న్స్ చూపించుకొందామ‌ని సందీప్ రెడ్డి రాసుకొన్న కొన్ని సీన్లు.. ప్రేక్ష‌కుడ్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. దానికి ఉదాహ‌ర‌ణ‌లుగా ఎన్నో స‌న్నివేశాలు, ఇంకెన్నో మాట‌లు ఈ సినిమా నిండా పేరుకుపోయాయి. ఉదాహ‌ర‌ణ‌కు… ఓ డాక్ట‌ర్ హీరోని ట్రీట్ చేస్తుంటుంది. ‘రోజుకి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటారు?’ అని హీరోని అడుగుతుంది. దానికి బ‌దులుగా ‘మీరు మీ భ‌ర్త‌తో ఎన్నిసార్లు సెక్స్ చేస్తారు’ అని ప్ర‌శ్నిస్తాడు హీరో. అది ఎక్స్‌ట్రీమిజం. మ‌రో చోట – హీరోకి బ‌దులుగా… ఓ బాడీ డూప్‌ని త‌యారు చేస్తుంది విల‌న్ టీమ్‌. ఆ బాడీ డూప్‌.. స‌ద‌రు హీరోకి కొన్ని రోజులు స‌న్నిహితంగా ఉన్న అమ్మాయితో.. ‘నాలో అన్నీ స‌రిగానే ఉన్నాయా లేదా? చూసుకో’ అంటూ త‌న ప్రైవేటు పార్ట్ చూపిస్తాడు. ఇది ఎక్ట్స్‌ట్రీమిజానికి ఎన్నో మెట్టో సందీప్ రెడ్డికే తెలియాలి. అండ‌ర్ వేర్ ఎలా ఉండాలి? దాన్ని ఎలాంటి డిజార్జింట్ తో ఉత‌కాలి? ప్రైవేటు పార్ట్ ద‌గ్గ‌ర షేవింగ్ చేసుకోవాలా వ‌ద్దా? దీని మీద రెండు పేజీల‌కు స‌రిప‌డా డిస్క‌ర్ష‌న్ పెట్టాడిందులో! అక్క‌డ ద‌ర్శ‌కుడి ఓపెన్ మైండ్‌, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ అన్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయి. కానీ.. ఈ క‌థ‌కూ, వాటికీ ఉన్న సంబంధం ఏమిటి? బోల్డ్ నెస్ అంటే, క‌ల్ట్ అంటే ఇంతేనా?

కొన్ని సీన్లు చూస్తే ద‌ర్శ‌కుడు బాగా రాసుకొన్నాడే అనిపిస్తుంది. కానీ దుర‌దృష్టం ఏమిటంటే ఆ సీన్ల‌కూ… ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని మొద‌లెట్టిన ఎమోష‌న్‌కీ సంబంధం ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ర‌ణ‌బీర్‌, ర‌ష్మిల మ‌ధ్య గొడ‌వ సీన్‌. అక్క‌డ భార్యా భ‌ర్త‌ల ఎమోష‌న్‌నీ బాగా క్యాప్చ‌ర్ చేశాడు ద‌ర్శ‌కుడు. చాలా సుదీర్ఘ‌మైన సన్నివేశం కూడా. ఇందులో ర‌ష్మిక‌, ర‌ణ‌బీర్ పీక్స్ లో త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. కానీ… ఈ సీన్‌కీ, ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకొన్న క‌థ‌కూ సంబంధం ఉండ‌దు. సీన్లు బాగున్నంత మాత్రాన స‌రిపోదు. అస‌లు క‌థ‌తో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ ఉండాలి. అది లేక‌పోతే నిడివి పెర‌గ‌డానికో, న‌టీన‌టులు, దర్శ‌కులు త‌మ ప్ర‌తిభ చూపించుకోవ‌డానికో త‌ప్పితే.. ఎందుకూ ప‌నికి రావు.

ఓ సీన్‌లో ర‌ణ‌బీర్ న‌గ్నంగా క‌నిపిస్తాడు. అలాంటి బోల్డ్ సీన్ లో న‌టించ‌డానికి ద‌మ్ముండాలి. ఈ విష‌యంలో ర‌ణ‌బీర్‌ని మెచ్చుకోవాల్సిందే. ‘అప్పుడే హీరోకి ఆప‌రేష‌న్ జ‌రిగింది. త‌ను పున‌ర్జ‌న్మ పొందాడు అందుకే సింబాలిక్‌గా ఈ షాట్‌’ అని హీరో – ద‌ర్శ‌కుడు అనుకొని ఉంటారు. అయితే మినిమం డిగ్రీ పాస్ అయితే కానీ అర్థం కాని సీన్లు ఇవి. స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు ఇదంతా ద‌ర్శ‌కుడి తాలూకూ పైత్యం అనుకొనే ప్ర‌మాదం ఉంది.

ద్వితీయార్థం ప్రారంభ‌మే.. ‘యానిమ‌ల్‌’ జోరుకు స్పీడు బ్రేక‌ర్‌గా అనిపిస్తుంది. హీరోకి ఓ స‌మ‌స్య‌, అందులోంచి బ‌య‌ట‌ప ప‌డ‌డం.. దీని చుట్టూ క‌నీసం 30 నిమిషాల క‌థ న‌డిపారు. ఆ త‌ర‌వాత సెప‌రేట్ గా మ‌రో ల‌వ్ ట్రాక్ మొద‌ల‌వుతుంది. ఆ ల‌వ్ ట్రాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో, అప్పుడు హీరో నిజాయ‌తీపై న‌మ్మ‌కం స‌డ‌లుతుంది. ఆ ల‌వ్ ట్రాక్ చివ‌ర్లో ఏదో జ‌స్టిఫై చేయాల‌ని చూశారు కానీ, ఆ డోస్ స‌రిపోలేదు. ద్వితీయార్థం ప్రారంభంలోనే అస‌లు విల‌న్ ని రంగంలోకి దింపి, హీరో – విల‌న్ మ‌ధ్య వార్ మొద‌లెడితే… ‘యానిమ‌ల్’ టెంపో వేరేలా ఉండేది. చివర్లో హీరో – విల‌న్లు చొక్కాలు చింపుకొని మ‌రీ కొట్టుకొంటున్నా… ఎందుకో ఆ ఫైట్ తో ఎమోష‌న్ క‌నెక్ష‌న్ క‌ట్ అయిపోతుంది. ఇంట్ర‌వెల్ ఫైట్ కూడా చాలా భారీగా తీశారు. అక్క‌డ మాస్ విజిల్స్ వేయించే షాట్స్ ఉన్నాయి. కాక‌పోతే అక్క‌డ కూడా ఎమోష‌న‌ల్ ట‌చ్ లేదు.

ర‌ణ‌బీర్ త‌న కెరీర్‌లో పీక్స్ చూసేశాడు. అంత‌కంటే ఇంకేం న‌టిస్తాడు? అనుకొంటున్న ప్ర‌తీసారీ ఇలాంటి సినిమాతో షాక్ ఇవ్వ‌డం త‌న‌కు అల‌వాటే. ‘యానిమ‌ల్‌’లోనూ అదే చేశాడు. త‌న క్యారెక్ట‌ర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా చోట్ల బోల్డ్ గా న‌టించాడు. తండ్రిపై త‌న ప్రేమ‌ని కురిపించే ప్ర‌తీ చోటా ఓ కొడుకుగా ర‌ణ‌బీర్ న‌చ్చేస్తాడు. ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోనూ హీరోయిన్ కి కూడా మంచి పాత్ర రాసుకొన్నాడు సందీప్‌. ముఖ్యంగా త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డే సీన్‌లో ర‌ష్మిక న‌ట‌న మెస్మ‌రైజ్ చేస్తుంది. అనిల్ క‌పూర్ ఉండ‌డం వ‌ల్లే.. తండ్రి పాత్ర‌కు హుందాత‌నం వ‌చ్చింది. త‌న అనుభ‌వాన్నంతా ఆయ‌న రంగ‌రించారు. బాబీ డియోల్ భ‌యంక‌రంగానే ఉన్నాడు. కానీ… త‌న పాత్ర‌ని చాలా ఆల‌స్యంగా రంగంలోకి దించారు. ఓ బ‌ల‌మైన విల‌న్‌ని హీరో ఢీ కొన‌బోతున్నాడ‌న్న ఫీలింగ్, భ‌యం ప్రేక్ష‌కుల‌లో క‌ల‌గ‌లేదు.

టెక్నిక‌ల్ గా ‘యానిమ‌ల్’ చాలా స్ట్రాంగ్ గా ఉంది. యాక్ష‌న్ సీన్ల‌పై భారీగా ఖ‌ర్చు పెట్టారు. ఇంట్ర‌వెల్ ముందు వాడిన మిష‌న్ గ‌న్ గురించి కొన్నిరోజులు మాట్లాడుకొంటారు. పాట‌లు క‌థ‌లో భాగ‌మైపోయాయి. యాక్ష‌న్ ఎపిసోడ్ లో.. పంజాబీ సాంగ్ వాడ‌డంతో మ‌రింత హైప్ వ‌చ్చింది. ర‌న్ టైమ్ గురించి ముందు నుంచీ జ‌నాలు భ‌య‌ప‌డుతూనే ఉన్నారు. దాదాపు 3 గంట‌ల 23 నిమిషాల సినిమా ఇది. క‌నీసం 30 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు. ర‌న్ టైమ్ త‌గ్గించి ఉంటే, ఇంపాక్ట్ బ‌రింత బ‌లంగా ఉండేది. ఈ సినిమాకి ఎడిట‌ర్ గా బాధ్య‌త‌లు నెర‌వేర్చింది కూడా సందీప్ రెడ్డినే. కాబ‌ట్టి.. ఈ విష‌యంలో మ‌రొక‌ర్ని నిందించే అవ‌కాశ‌మే లేదు.

ఓవ‌రాల్ గా చూస్తే… ‘యానిమ‌ల్‌’లో కొన్ని సీన్లు వావ్ అనిపిస్తే.. ఇంకొన్ని ‘ఓవ‌ర్ ది బోర్డ్’ అనే ఫీలింగ్ తీసుకొచ్చాయి. చాలా స‌న్నివేశాలు ఈ సినిమాని కుటుంబ స‌మేతంగా చూసే ధైర్యాన్ని దూరం చేశాయి. రాసుకొన్న ప్ర‌తీ సీన్‌నీ ప్రేమించేయ‌డం, రాసుకొన్న‌ది రాసుకొన్న‌ట్టు చూపించాల‌న్న త‌ప‌న‌, ఇవ‌న్నీ సందీప్‌రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అడ్డు గోడ‌లుగా మారాయి. బోల్డ్‌నెస్‌, ‘రా’ నెస్ భ‌రించే వాళ్ల‌కు కూడా ‘యానిమ‌ల్‌’ విచ‌క్ష‌ణ కోల్పోయిన‌ట్టు అనిపించొచ్చు.

తెలుగు360 రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close