‘జాతిరత్నాలు’ తో ఓ ట్రెండ్ సెట్టింగ్ సినిమా అందించాడు అనుదీప్. ఆ తరవాత తీసిన ‘ప్రిన్స్’ ఓకే అనిపించింది. మొన్నటి `ఫంకీ`తో అయితే పూర్తిగా విమర్శల పాలయ్యాడు. కామెడీ పేరుతో సినిమాని కిచిడీ చేస్తున్నాడన్న విశ్లేషణలు వినిపించాయి. అనుదీప్ రూటు మార్చకపోతే కెరీర్ కి ఎండ్ కార్డ్ పడడం ఖాయమన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అనుదీప్ రూటు మార్చాడు. ఈసారి లేడీ ఓరియెంటెడ్ కథని తయారు చేసుకొన్నాడు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోందని టాక్. పీపుల్ మీడియా సంస్థ కూడా అనుకొన్న స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోతోంది. ‘రాజాసాబ్`తో ఆ సంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది. మరోసారి కథల విషయంలో రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అనుదీప్ దీ అలాంటి పరిస్థితే. సో.. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నదే ప్రశ్న.
లేడీ ఓరియెంటెడ్ కథ ఓ సీరియస్ ఇష్యూ నేపథ్యంలో నడుస్తుందని, అనుదీప్ తరహా కామెడీ, పంచ్‌లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదని టాక్. కాకపోతే… ఈ కథకు ఓ స్టార్ హీరోయిన్ అవసరం. ఆ స్టార్ ని బట్టే ఈ కథకు ఓ వాల్యూ వస్తుంది. ప్రస్తుతం ఆ కథానాయిక కోసం అన్వేషణ సాగుతుందని తెలుస్తోంది. ‘జాతిరత్నాలు’ తరహాలో ముగ్గురు మిత్రుల కథ కూడా అనుదీప్ దగ్గర సిద్ధంగా ఉంది. కాకపోతే.. అందుకోసం ఓ యువ హీరో కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుదీప్ ని నమ్మడానికి యంగ్ హీరోలెవరూ సిద్దంగా లేరు. అందుకే లేడీ ఓరియెంటెడ్ కథతోనే ట్రావెల్ చేయాలని ఫిక్సయ్యాడు ఈ దర్శకుడు. పీపుల్ మీడియా ఓ స్టార్ హీరోయిన్ ని ఒప్పించి, టీమ్ లోకి తీసుకొంటే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. మరోవైపు అనుదీప్ కూడా తన పరిచయాలన్నీ వాడడానికి ప్రయత్నిస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ బయటకు రావొచ్చు.
