ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసభ్యకర పోస్టులు, విద్వేషపూరిత ఫ్లెక్సీల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు పోలీస్ శాఖలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై కోర్టు చేసిన వ్యాఖ్యలు, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేలా ఉన్నాయి. ఇకపై విద్వేషాలను చిమ్మే కాలకేయుల పై పోలీసులు ఉక్కుపాదం మోపడం ఖాయంగా కనిపిస్తోంది.
పోలీసుల పంజా కు రంగం సిద్ధం!
ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు చేయడం, నరుకుతాం.. చంపుతాం అంటూ బహిరంగంగా ఫ్లెక్సీలు కట్టడం ఒక ప్రమాదకరమైన ధోరణిగా మారింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, పోలీసుల వైఫల్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులు ఒకసారి అరెస్టు అయినా భయం లేకుండా మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారంటే అది పోలీసుల వైఫల్యమేనని కోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ముఖ్యమంత్రిని, న్యాయమూర్తులను సైతం వదలకుండా అసభ్యంగా పోస్టులు పెట్టడం ఐదు కోట్ల ప్రజలను అవమానించడమేనన్న కోర్టు వ్యాఖ్యలు, పోలీసులకు ఒక గట్టి హెచ్చరికలా పనిచేశాయి.
చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులు
ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి వస్తున్న బెదిరింపులు, విద్వేషపూరిత పోస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు కొంత తడబడ్డారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, కోర్టు జోక్యంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఎవరైతే చట్టాన్ని గౌరవించకుండా, వ్యవస్థలను కించపరుస్తూ పోస్టులు పెడతారో వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీస్ యంత్రాంగం సంకేతాలు పంపుతోంది. లుకౌట్ నోటీసులు జారీ చేయడం, అరెస్టులు చేసిన తర్వాత కూడా నిరంతర నిఘా ఉంచడం వంటి చర్యల ద్వారా సోషల్ మీడియా అరాచకవాదుల ఆట కట్టించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైంది.
రప్పా రప్పా అంటే ఇక వదలరు!
ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది విధానపరంగా ఉండాలి తప్ప, అది ఒక వ్యక్తి గౌరవాన్ని భంగపరిచేలా ఉండకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా విధ్వంసం చేస్తాం అని రాసి ఉన్న ఫ్లెక్సీలను చూసి కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఎవరిని ధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? ప్రజల్నా? అని అడిగిన ప్రశ్నలు వైసీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశాయి. ఇలాంటి ఫ్లెక్సీలు కట్టే వారిపై కేవలం కేసులు పెట్టడమే కాకుండా, వారి వెనుక ఉన్న సూత్రధారులను కూడా బయటకు తీయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. బెదిరింపులకు భయపడే కాలం పోయిందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏమవుతుందిలే అన్న ధీమా ఉన్న వారికి, ఇకపై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగక తప్పదు. పోలీసులకు కోర్టు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ తో విద్వేష పోస్టులు పెట్టే వారిపై పంజా విసరడం ఖాయం.
