యాక్షన్ కింగ్ అర్జున్ తో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ‘శ్రీ మంజునాథ’ లో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆ మైత్రీ మరింత బలపడింది. అర్జున్ దర్శకత్వంలో ‘సీతా పయనం’ అనే చిత్రం రూపుదిద్దుకొన్న సంగతి తెలిసిందే. ఈ కథంతా చిరంజీవికి తెలుసు. ఈ కథ విని.. అర్జున్‌కు ఓ సలహా ఇచ్చారు చిరంజీవి. ”ఈ సినిమాలోకి ఓ కీలకమైన పాత్ర ఉంది కదా.. దానికెవరైనా ఓ మంచి నటుడ్ని తీసుకోండి..” అన్నార్ట. చిరు సలహా మేరకు విజయ్ సేతుపతిని ఓ పాత్ర కోసం సంప్రదించారు చిరు. కానీ ఆయన అందుబాటులో లేరు. దాంతో ఆ పాత్రకు చిన్న చిన్న మార్పులు చేసి, తానే స్వయంగా నటించారు. ‘సీతా పయనం’ లోని ఆ కామియో రోల్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని అర్జున్ చెబుతున్నారు.
ఈ సినిమాలోనే అర్జున్ మేనల్లుడు ధృవ్ సజ్జా మరో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ కూడా క్రేజీ గా ఉండబోతోందని సమాచారం. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాలో హీరో పాత్ర కోసం ముందుగా విశ్వక్సేన్ని అనుకొన్న సంగతి తెలిసిందే. విశ్వక్ తో అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. కానీ.. కొన్ని కారణాల వల్ల విశ్వక్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ పాత్రలో ఉపేంద్ర బంధువు నిరంజన్ సుధీంద్ర కనిపించనున్నారు. ఇటీవలే టీజర్ విడుదలైంది. త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేస్తారు. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
