ఆ ఫ్లాపుతో.. రెండు రోజులు ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాలేదు – బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఇంట‌ర్వ్యూ

తొలి సినిమాతోనే రూ.40 కోట్ల హీరో అయిపోయాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. వినాయ‌క్‌, బోయ‌పాటి శ్రీ‌ను, శ్రీ‌వాస్‌, తేజ‌…. ఇలా పెద్ద ద‌ర్శ‌కులోనే ప్ర‌యాణం చేస్తూ.. సేఫ్ ప్రాజెక్టుల‌ను ఎంచుకుంటున్నాడు. తొలిసారి… ఓ యువ ద‌ర్శ‌కుడికి ఛాన్సిచ్చిన సినిమా ‘క‌వ‌చం’. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు శ్రీ‌నివాస్‌. ఈ శుక్ర‌వారం ‘క‌వ‌చం’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా బెల్లంకొండ‌తో చిట్ చాట్‌.

హాయ్‌..

హాయండీ..

క‌వ‌చం స్టోరీ సింగిల్ లైన్‌లో చెప్ప‌మంటే…?

ఓ పోలీస్ ఆఫీస‌ర్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ఎలా తిప్పికొట్టాడు, త‌న నిజాయ‌తీని ఎలా నిరూపించుకున్నాడు? అనేదే క‌థ‌. ఒక రోజులో పూర్త‌య్యే క‌థ ఇది. స్క్రీన్ ప్లే చాలా ఆస‌క్తిగా ఉంటుంది.

తొలిసారి పోలీస్ పాత్ర పోషించారు.. ఎలా ఉంది ఆ అనుభ‌వం?

ఫ‌స్ట్ లుక్ రాగానే.. ‘పోలీస్ గెట‌ప్‌లో బాగున్నావ్‌’ అన్నారంతా. చిన్న‌ప్ప‌టి నుంచీ పోలీస్ సినిమాలంటే చాలా ఇష్టం. అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన పోలీస్ సినిమాలన్నీ చూశా. ఆయ‌న పోలీస్ వేషం వేస్తున్నారంటే.. హీరో పేరు ‘విజ‌య్‌’ అని పెట్టుకుంటారు. ఆ స్ఫూర్తితోనే ఈ సినిమాలో నా పాత్ర‌కు విజ‌య్ అనే పేరు పెట్టాం.

కొత్త ద‌ర్శ‌కుడితో ప‌నిచేశారు.. ఈ క‌థ‌ని డీల్ చేయ‌డంలో త‌న అనుభ‌వం స‌రిపోయింద‌నిపించిందా?

ఫాస్ట్ బేస్డ్ క‌థ ఇది. క‌థ‌నం చాలా వేగంగా వెళ్తుంది. క‌థ‌లోకి వెళ్తే కొద్దీ కొత్త కొత్త పొర‌లు, ట్విస్టులు వ‌స్తుంటాయి. ఇలాంటి క‌థ‌ని డీల్ చేయడానికి అనుభ‌వం కావాలి. కానీ కొత్త ద‌ర్శ‌కుడైనా… శ్రీ‌నివాస్ చాలా బాగా చేశాడు.
గోపాల గోపాల, దృశ్యం లాంటి చిత్రాల‌కు స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు శ్రీ‌నివాస్‌. త‌న‌కు త‌ప్ప‌కుండా మంచి పేరొస్తుంది.

ప్ర‌తీసారీ స్టార్ హీరోయిన్‌నే ఎంచుకుంటున్నారు కార‌ణం ఏమిటి?

బ‌డ్జెట్ అనుకూల‌త‌ని బ‌ట్టే క‌థానాయిక‌ని ఎంచుకుంటున్నాం. ఓ పెద్ద హీరోయిన్ ఉంటే మార్కెట్ కూడా బాగుంటుంది క‌దా. పైగా పోస్ట‌ర్లు చూడ్డానికి క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. స‌మంత‌, కాజ‌ల్‌, త‌మ‌న్నా.. ఇలా స్టార్ హీరోయిన్లంతా అయిపోతున్నారు. ఇక మీద‌ట కొత్త‌వాళ్ల‌తోనే చేయాలేమో.

ఇది వ‌ర‌క‌టి సినిమాల‌న్నీ బ‌డ్జెట్ ప‌రంగానే బోల్తా కొట్టాయి. ఆ స‌మీక‌ర‌ణాలు అర్థ‌మ‌య్యాయా?

మీర‌న్న‌ది నిజ‌మే. నా ఫ్లాపుల్లో ఎక్కువ కాస్ట్ ఫెయిల్యూర్సే ఉంటాయి. `క‌వ‌చం` మాత్రం మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చేశాం. దాదాపు 20 కోట్ల రూపాయ‌లు శాటిలైట్ ద్వారానే వ‌చ్చేశాయి. థియేట‌రిక‌ల్ నుంచి మ‌రో ప‌ది కోట్లు వ‌స్తే చాలు. విడుద‌ల‌కు ముందే సేఫ్ అయిన సినిమా ఇది.

సాక్ష్యం ఫ‌లితం మిమ్మ‌ల్ని నిరాశ‌కు గురిచేసిందా?

అవును.. సాక్ష్యం బాగా నిరుత్సాప‌ర‌హ‌రిచింది. ఆసినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. దాదాపుగా 200 రోజుల కాల్షీట్లు ఇచ్చి చేసిన సినిమా అది. రిజ‌ల్ట్ నిరాశ‌కు గురి చేసింది. రెండు మూడు రోజులు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయాను. చేతిలో సినిమాలు ఉన్నాయి కాబ‌ట్టి.. ప‌నిలో ప‌డి దాన్ని మ‌ర్చిపోగ‌లిగాను. లేక‌పోతే కోలుకోవ‌డానికి చాలా టైమ్ ప‌ట్టేదేమో.

ప్రేమ క‌థ‌లు చేయాల్సిన వ‌య‌సులో యాక్ష‌న్ సినిమాల్ని ఎంచుకుంటున్నారేంటి?

యాక్ష‌న్ సినిమాలుల్లో చేయ‌డానికి చాలా స్కోప్ ఉంటుంది. ల‌వ్ స్టోరీలలో ఎక్కువ చేయ‌లేం. యాక్ష‌న్ అయితే ర‌క‌ర‌కాలుజోన‌ర్లు ఉంటాయి. మ‌మ్మ‌ల్ని మేం ప్రూవ్ చేసుకోవ‌డానికి స్కోప్ ఉంటుంది. కొత్త‌గా క‌థ‌లు దొరుకుతున్నాయి. అందుకే ఇలాంటి క‌థ‌ల్ని ఎంచుకుంటున్నా.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు క‌దా. ఆ సంగ‌తులేంటి?

ఆయ‌న చాలా గొప్ప ద‌ర్శ‌కుడు. సెట్‌కి వెళ్తున్న‌ట్టు అనిపించ‌దు. ఏదో స్కూల్ కి వెళ్తున్న ఫీలింగ్ క‌లుగుతోంది. మ‌రో ప‌ది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. తొలిభాగం స్వ‌చ్ఛ‌మైన వినోదం, రెండో భాగంలో యాక్ష‌న్ క‌నిపిస్తాయి. అల్లుడు శ్రీ‌ను త‌ర‌వాత నేను అంత‌గా న‌వ్వించిన సినిమా ఇదే అవుతుంది.

మీ కెరీర్‌లో నాన్న‌గారి స‌పోర్ట్ ఎంత వ‌ర‌కూ ఉంటుంది. మీ క‌థ‌ల‌కు సంబంధించి ఆయ‌నేమైనా స‌ల‌హాలు ఇస్తారా?

నా బ‌లం ఆయ‌నే. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ క‌థ ఆయ‌న వింటారు. విలువైన‌ స‌ల‌హాలు ఇస్తారు. ఆయ‌నొక్క‌రే కాదు.. నా చుట్టు ప‌క్క‌ల‌వాళ్ల స‌ల‌హాలూ ప‌దే ప‌దే అడుగుతుంటా. ప‌ది మంది అభిప్రాయాలు తెలుసుకుంటే… మ‌నం ఏం చేయాలో, ఏం చేయ‌కూడ‌దో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.