కామారెడ్డిలో రోజంతా హైడ్రామా నడిచింది. అక్కడ అంత స్కోప్ లేదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ కావాలనే అంత సీన్ క్రియేట్ చేశాయి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై అరోరా భూముల్నికబ్జా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. తాను అలా చేయలేదని కావాలంటే చర్చకు రావాలని రమణారెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలు సై అన్నారు. సహజంగా ఇలాంటి సవాళ్లు పోలీసుల హౌస్ అరెస్టులతో అయిపోతాయి. కానీ అలా అయితే ఎక్కువ పబ్లిసిటీ రాదని కాస్త ముందుకెళ్లారు. రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఓ కారును తిరగేశారు.
వరుసగా బీజేపీ నేతలు.. కాంగ్రెస్ అంతు చూస్తామని బెదిరించడం ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలూ అదే చెబుతున్నారు. కామారెడ్డి నుంచి ఈ పోరాటాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్నారన్నమాట. బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఆ రెండు పార్టీల ఫైట్ ను .. ఏదో జరిగిపోతోందని ప్రచారం కల్పించింది. కానీ అసలు రాజకీయం వారికి అర్థం కాలేదు. రాజకీయం అంతా ఉంటే గింటే మా రెండు పార్టీల మధ్యే ఉందన్నట్లుగా రాజకీయం మార్చేస్తున్నారు. దానికి కామారెడ్డిలోనే బీజం వేసుకున్నారు.
కామారెడ్డి అంటే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పోటీ చేసిన నియోజకవర్గం. ఆయన ఓడిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనీస సీట్లను సాధించలేకపోయింది. కాంగ్రెస్ బలపడింది. బీజేపీ తన ఉనికి కాపాడుకునేందుకు మరింత గట్టిగా ప్రయత్నించనుంది. అందుకే ఇప్పుడు కామారెడ్డిలో ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సాగుతుంది. ఈ కుంపటితో దాన్ని ఉత్తర తెలంగాణ అంతా విస్తరించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
