జాతీయ స్థాయిలో ఎన్డీఏను ఓడిస్తామంటూ రెడీ అయిన ఇండీ కూటమి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బెంగాల్ , తమిళనాడు ఫలితాల తర్వాత పూర్తిగా ఆ కూటమి ఉనికి ఉండదని స్పష్టమవుతోంది. దీనికి కారణం రాహుల్ తీసుకున్న నిర్ణయాలే. 15 ఏళ్ల అధికారాన్ని కోల్పోయిన దీదీ, ఇప్పుడు తన మనుగడ కోసం మళ్లీ కూటమి రాగం అందుకున్నప్పటికీ, ఆమెను ఆదరించే నాథుడే కరువయ్యాడు. ముఖ్యంగా బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మమతతో కలిసి నడిచేందుకు ససేమిరా అన్నాయి. అవసరం ఉన్నప్పుడు కూటమిని వాడుకుని, ఎన్నికల వేళ ఒంటరిగా వెళ్లే మమతతో పొత్తు అంటే అది రాజకీయ ఆత్మహత్యే అని కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఫలితంగా బెంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా పెరిగిపోయింది. జాతీయ స్థాయిలో కలిసున్నా.. ఉపయోగం లేనట్లే.
స్టాలిన్ దూరం.. విజయ్ భయం
కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాదిలో కూటమికి వెన్నెముకగా ఉన్న డీఎంకే కూడా ఇప్పుడు తన దారి తాను చూసుకుంది. దానికి కాంగ్రెస్సే అవకాశం కల్పించింది. స్టాలిన్ తన భవిష్యత్తు కోసం జాతీయ కూటమిని పక్కన పెట్టి ప్రాంతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందన్న భావనలో డీఎంకే ఉంది. స్టాలిన్ లాంటి బలమైన నేత కూడా కూటమికి దూరమవ్వడం ఇండియా బ్లాక్‌కు కోలుకోలేని దెబ్బ.
రాహుల్ గాంధీ నాయకత్వంపై అపనమ్మకం
కూటమి విచ్ఛిన్నం కావడానికి రాహుల్ గాంధీ అనుసరిస్తున్న మొండి వైఖరి , వ్యూహాల లేమి ప్రధాన కారణం. డీఎంకేతో చర్చించకుండా విజయ్‌కు మద్దతు ప్రకటించేశారు. ప్రాంతీయ పార్టీలను గౌరవించకుండా, కేవలం కాంగ్రెస్ ప్రయోజనాలనే ప్రాధాన్యతగా తీసుకోవడం వల్ల అఖిలేష్ యాదవ్ కూడా పట్టించుకోవడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడో గుడ్ బై చెప్పారు. ఒకవైపు మమత ఓటమి, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలు కూటమి నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. గెలిచే గుర్రంపై పందెం కాయాలి కానీ, కుప్పకూలుతున్న కూటమిలో ఉండి ప్రయోజనం ఏంటి అన్న ధోరణి ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తోంది.
క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ
విపక్షాల మధ్య నెలకొన్న ఈ అనైక్యత, అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి తిరుగులేని అవకాశంగా మారాయి. సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్లో బీజేపీ జైత్రయాత్ర మొదలవ్వడం, జాతీయ స్థాయిలో మోదీ చరిష్మా తగ్గకపోవడం విపక్షాలను రక్షణలో పడేశాయి. విపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల జరుగుతున్న ప్రతి ఎన్నికలో బీజేపీకి ఎదురేలేకుండా పోతోంది. ఇండియా కూటమి అనేది కేవలం ఫోటో షూట్లకు, ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో అది పూర్తిగా కుప్పకూలిపోయిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేని నేతలు, ఉమ్మడి లక్ష్యం లేని పార్టీలు కలిసినా ప్రయోజనం ఉండదని తేలిపోయింది. 2026 నాటికే ఈ కూటమి ముక్కలు ముక్కలుగా విడిపోవడంతో, జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటైన ప్రత్యామ్నాయం లేదన్నది నగ్న సత్యం.
