వైద్య విద్య కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థుల ఆశలపై నీట్ పేపర్ లీకేజీ నీళ్లు చల్లింది. మే 3న జరిగిన నీట్ పరీక్షకు రెండు రోజుల ముందే, అంటే మే 1వ తేదీనే ఒక గెస్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేట్ అయినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. సుమారు 410 ప్రశ్నలతో కూడిన ఈ ప్రశ్నపత్రం ముందే బయటకు రావడం, అందులోని 120కి పైగా ప్రశ్నలు అసలు పరీక్షలో యథాతథంగా దిగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ లీకేజీ మూలాలు హైదరాబాద్లోనే ఉన్నాయన్న అనుమానాలు బలపడుతుండటంతో అభ్యర్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గెస్ పేపర్ చదివిన విద్యార్థులు సునాయాసంగా భారీ మార్కులు సాధించే వెసులుబాటు కలిగింది. పరీక్షలో వచ్చిన 180 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు ఈ పేపర్ నుంచే రావడంతో, ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేవలం ఆ ప్రశ్నలకే 480 మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటికి తోడు మరో 20 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగితే 560 మార్కులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కష్టపడి చదివిన సామాన్య విద్యార్థులకు రావలసిన సీట్లను, ఈ లీకైన పేపర్ ద్వారా అక్రమార్కులు తన్నుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.
రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జరుపుతున్న దర్యాప్తులో ఈ లీకేజీ వెనుక ఒక భారీ నెట్వర్క్ ఉన్నట్లు బయటపడింది. మే 1న ఈ ప్రశ్నపత్రం హైదరాబాద్ నుండి రాజస్థాన్ , కేరళలోని కోచింగ్ సెంటర్లకు చేరినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఒక్కో పేపర్ ను రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు అమ్ముకున్నట్లు సమాచారం. పరీక్ష ముగిసిన నాలుగు రోజుల తర్వాత మే 7న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి కూడా ఫిర్యాదులు అందడంతో, వారు కూడా అంతర్గత విచారణను వేగవంతం చేశారు.
నీట్ వంటి అత్యున్నత స్థాయి పరీక్ష నిర్వహణలో ఇలాంటి లోపాలు తలెత్తడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది జరిగిన వివాదాలు మరువక ముందే, 2026లో మళ్లీ అదే తరహాలో పేపర్ లీక్ అవ్వడం విద్యార్థుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ వ్యవహారంలో దోషులెవరో తేల్చి, అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. విచారణలో తేలే అంశాలను బట్టి ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.


