ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ యర్నెస్ట్ అండ్ యంగ్ తన జీసీసీ కార్యకలాపాలను ఏపీలో విస్తరించాలని నిర్ణయించింది. ఐఎస్జీ గ్లోబల్ స్టడీలో జీసీసీ సేవల విభాగంలో లీడర్ గా గుర్తింపు పొందిన ఈవై, తన అత్యాధునిక సాంకేతిక సేవలను విశాఖ నుండి నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం కార్యకలాపాల నిర్వహణకే పరిమితం కాకుండా, ఏరోస్పేస్, హెల్త్‌కేర్ ,డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాలలో ఇక్కడి నుండి వ్యూహాత్మక సేవలందించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ తాజా ఐటీ , జీసీసీ పాలసీ 4.0 ఇందుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. విశాఖపట్నంను ప్రత్యేక జీసీసీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ రోడ్ షోలు , మౌలిక సదుపాయాల కల్పన విదేశీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి కావడంతో పాటు, ఈవై వంటి సంస్థలు కూడా తమ ఉనికిని చాటుకోవడంతో విశాఖ ప్రాంతంలో సుమారు 20 వేల నుండి 30 వేల కొత్త ఐటీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ల్యాండ్ ఇన్సెంటివ్స్ , నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత ఏపీని జీసీసీలకు మ్యాజిక్ డెస్టినేషన్ గా మార్చాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెరిగిన నిర్వహణ వ్యయంతో పోలిస్తే, విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆఫీస్ స్పేస్ తక్కువ ధరకు లభించడం ఎంఎన్సీలకు కలిసొచ్చే అంశం. దీంతో రాబోయే రెండేళ్లలో కనీసం 50కి పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఏపీలో తమ జీసీసీలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఐటీ రంగంలో తన పూర్వ వైభవాన్ని చాటుకుంటోంది. కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డేటా అనలిటిక్స్ , గ్లోబల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వంటి ఉన్నత స్థాయి సేవల కేంద్రంగా రాష్ట్రం అవతరిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధిని ఇంటి చెంతకే తీసుకువస్తున్నాయి.
