భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి పరిశ్రమ హోదా (Industry కల్పించాలనేది రియల్ ఎస్టేట్ డెవలపర్ల చిరకాల డిమాండ్. ఈ హోదా లభిస్తే, ప్రాజెక్టుల నిర్మాణానికి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి. ప్రస్తుతం డెవలపర్లు అధిక వడ్డీతో వాణిజ్య రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది, ఇది ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతోంది. పరిశ్రమ హోదా వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సులభంగా రావడమే కాకుండా, పెద్ద సంస్థల నుంచి తక్కువ ఖర్చుతో కూడిన దీర్ఘకాలిక నిధుల సేకరణ సాధ్యమవుతుంది. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గి, సామాన్యులకు ఇళ్లు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మధ్యతరగతి గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు హోమ్ లోన్ వడ్డీ రాయితీని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని రియల్టీ సంస్థలు గట్టిగా కోరుతున్నాయి. గత పదేళ్లుగా ఈ పరిమితి పెరగకపోవడం, మరోవైపు ఇళ్ల ధరలు , వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఈ మార్పు అనివార్యమని నిపుణులు వాదిస్తున్నారు. ఈ మినహాయింపు పెరిగితే పన్ను చెల్లింపుదారుల చేతిలో నికర ఆదాయం పెరిగి, వారు ఇళ్ల కొనుగోలుకు ముందుకు వస్తారు. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో కూడా ఈ రాయితీని వర్తింపజేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అలాగే ప్రస్తుతం రూ. 45 లక్షల వరకు ఉన్న ఇళ్లను మాత్రమే అఫోర్డబుల్ కేటగిరీగా పరిగణిస్తున్నారు, కానీ మెట్రో నగరాల్లో భూమి ధరలు పెరిగిన దృష్ట్యా ఈ పరిమితిని రూ. 75 లక్షల నుండి రూ. 90 లక్షల వరకు పెంచాలని కోరుతున్నారు. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, స్టీల్‌పై జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, నిలిచిపోయిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉంటాయని రియల్టీ రంగం ఆశిస్తోంది.నిర్మలమ్మ ఎంత దయచూపుతారో ఆదివారం తేలిపోనుంది.


