తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూతన కమిటీల కూర్పు రాజకీయాల్లో టీడీపీ ప్రత్యేకతను మరోసారి చూపించింది. కేవలం పదవుల పంపిణీగానే కాకుండా, పార్టీ మూలాలను బలోపేతం చేసే దిశగా సాగిన ఈ కసరత్తులో క్యాడరే పార్టీకి సుప్రీం అనే సందేశాన్ని చంద్రబాబు గట్టిగా పంపారు. ముఖ్యంగా ఒక మండల స్థాయి నాయకురాలిని , క్లస్టర్ ఇన్ఛార్జిని నేరుగా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కష్టపడే కార్యకర్తలకు టీడీపీలో ఆకాశమే హద్దు అని నిరూపించింది.
సామాజిక విప్లవం – బడుగులకు పెద్దపీట
నూతన కమిటీల కూర్పులో చంద్రబాబు నాయుడు జనాభా దామాషా పద్ధతిని పక్కాగా అమలు చేశారు. 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో ఏకంగా 122 మందిని బడుగు, బలహీన వర్గాలు BC, SC, ST, మైనార్టీ నుంచే ఎంపిక చేశారు. బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం చొప్పున ప్రాధాన్యత కల్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన పుట్టుక నాటి సామాజిక సిద్ధాంతానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు దక్కని విధేయులకు ఈ కమిటీల్లో స్థానం కల్పించడం ద్వారా అసంతృప్తులకు తావులేకుండా సమతుల్యత పాటించారు.
మహిళా సాధికారత – 33 శాతం లక్ష్యంగా..
రాబోయే నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ల బిల్లును దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు కల్పించడమే కాకుండా, పొలిట్ బ్యూరో , జాతీయ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి వంటి సామాన్య కార్యకర్తను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించడం మహిళా లోకానికి టీడీపీ ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. ఇది క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వం ఎదగడానికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.
లోకేష్ నేతృత్వంలో 2029 వ్యూహం
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడం, పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవడం ద్వారా పార్టీలో యువ నాయకత్వానికి మార్గం సుగమమైంది. 2029 ఎన్నికల లక్ష్యంగా, పార్టీని TDP 3.0 వెర్షన్లోకి తీసుకెళ్లేలా యువతకు, కొత్త ముఖాలకు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారు. సీనియర్ల అనుభవాన్ని, యువత దూకుడును మేళవించి రూపొందించిన ఈ కమిటీలు.. పార్టీ పునాదులను మరింత పటిష్టం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తన మార్కు రాజకీయం ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
