తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకం హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. చాలా మంది దీన్ని ఒక పదోన్నతిగా , కొత్త హోదాగా చూస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది లోకేష్ గత కొన్నేళ్లుగా పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలకు అధికారిక ముద్ర మాత్రమే. 2024 ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి, పార్టీ యంత్రాంగాన్ని నడిపించడంలో ఆయన పోషించిన పాత్ర అసాధారణం.
బాధ్యతలను బట్టి పదవి
నారా లోకేష్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం అనేది ఒక హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. గత రెండేళ్లుగా, ముఖ్యంగా యువగళం పాదయాత్ర తర్వాత పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగంపై ఆయనకు పూర్తి పట్టు లభించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై దృష్టి సారిస్తుంటే, లోకేష్ పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ నియామకం ద్వారా పార్టీలో నెంబర్ 2 ఎవరనే విషయంలో ఉన్న సందేహాలకు స్వస్తి పలకడమే కాకుండా, భవిష్యత్ నాయకత్వంపై ఒక స్పష్టమైన సంకేతాన్ని క్యాడర్‌కు పంపారు.
పార్టీని జెన్‌జీకి దగ్గర చేస్తున్న లోకేష్
పార్టీని గాడిలో పెట్టడంలో లోకేష్ అనుసరిస్తున్న శైలి చాలా భిన్నంగా ఉంది. ఎవరితో చనువుగా ఉండాలో, ఎవరితో కటువుగా వ్యవహరించాలో ఆయనకు పక్కాగా తెలుసని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే పని చేయని నాయకులను నిర్మొహమాటంగా పక్కన పెట్టడం ద్వారా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నేత కొడుకు అనే ముద్రను చెరిపేసి, తన సొంత కార్యదక్షతతో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిని ఆయన ఎప్పుడో సంపాదించుకున్నారు.
టీడీపీ 3.0 వెర్షన్ దిశగా లోకేష్ అడుగు
నారా లోకేష్ ప్రవేశపెట్టిన TDP 3.0 , క్లస్టర్, యూనిట్ ఇన్-ఛార్జ్ శిక్షణ తరగతులు పార్టీని ఆధునిక రాజకీయాలకు అనుగుణంగా మార్చాయి. సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో వారసత్వంగా పదవులు వస్తుంటాయి, కానీ లోకేష్ విషయంలో ఆయన పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్సూరెన్స్ పథకాలు , కార్యకర్తల శిక్షణ వంటి క్లిష్టమైన పనులను విజయవంతంగా నిర్వహించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆయన పడ్డ కష్టానికి , పార్టీలో ఆయనకున్న అంగీకారానికి లభించిన గుర్తింపు మాత్రమే.
పార్టీపై లోకేష్‌కు మరింత బాధ్యత
రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో సమూల మార్పులు చేయడానికి లోకేష్‌కు ఈ పదవి మరింత స్వేచ్ఛను ఇస్తుంది. పొలిట్ బ్యూరో నుంచి గ్రామ స్థాయి వరకు 33 శాతం కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆయన ప్రతిపాదన పార్టీని యువతరంతో నింపే ప్రయత్నంగా కనిపిస్తోంది. చంద్రబాబు అనుభవం, లోకేష్ దూకుడు కలగలిసి పార్టీని మరింత శక్తివంతంగా మార్చేలా ఈ నిర్ణయం ఉంది. మొత్తానికి, లోకేష్‌కు దక్కిన ఈ గౌరవం ఆయన క్షేత్రస్థాయిలో చేసిన కృషికి ఫలితం అని చెప్పక తప్పదు.
