తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు, తన సొంత పార్టీ అధినేత సభకే దూరంగా ఉండి ఢిల్లీ బాట పట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, రవిచంద్రలతో కలిసి ఆయన సుప్రీంకోర్టు లాయర్లను కలిసినట్లు ఓ ఫోటోను విడుదల చేసినప్పటికీ, ఆ వివరణ వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
కాళేశ్వరం తీర్పు.. ఉచ్చు బిగుస్తోందన్న ఆందోళన?
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నియమించిన పి.సి. ఘోష్ కమిషన్ విచారణపై తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 22న కీలక తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించడానికే హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. కానీ అసలు అజెండా వేరు ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ పర్యటన కేవలం న్యాయపరమైనది మాత్రమే కాదని, దీని వెనుక పొలిటికల్ సెటిల్మెంట్ ఉందని ఆరోపిస్తున్నారు. ఆరెస్సెస్ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారని అంటున్నారు.
ఎవర్ని కలిశారో బయటపెడతానన్న రేవంత్
హరీష్ రావు ఢిల్లీలో ఆరెస్సెస్ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు కేంద్ర పెద్దల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే కోణంలో అధికార కాంగ్రెస్ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. కేవలం లాయర్లతో మాట్లాడటానికే హరీష్ ఢిల్లీ వెళ్లారని ఎవరూ అనుకోవడంలేదు. ఎంతో ముఖ్యమైన విషయాలు ఉంటే తప్ప కేసీఆర్ సభను మిస్ కారని అంటున్నారు.
విచారణలు తప్పించుకోవడమే అసలు టార్గెట్
అధిష్టానం నిర్ణయం మేరకే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారా? లేక వ్యక్తిగత రక్షణ కోసమా? అన్నది బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అయోమయానికి గురిచేస్తోంది. ఒకవైపు కాళేశ్వరం విచారణ గండం వెంటాడుతున్న తరుణంలో, హరీష్ రావు రహస్య పర్యటన మీడియా ద్వారా బయటకు రావడం పార్టీ సిన్సియారిటీ ని ప్రశ్నించేలా చేస్తోంది. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న హరీష్ రావు గుంభనంగా ఉన్నారు.
