ఆంధ్రప్రదేశ్లో సుమారు ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను తీరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలను నింపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన గ్రాట్యూటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులకు మార్గం సుగమం చేస్తూ నిధులు విడుద చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పెండింగ్లో పెట్టిన దాదాపు రూ. 7,358 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా సుమారు రూ. 2,950 కోట్ల నిధులను విడుదల చేయడంతో రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో గ్రాట్యూటీ, సరెండర్ లీవ్ నగదు జమ అవుతోంది. నిధుల కొరత సాకుతో గత ప్రభుత్వం కాలయాపన చేసిన ఈ బిల్లులను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తుండటం గమనార్హం.
నిజానికి, ఈ బకాయిలన్నీ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే చెల్లించాల్సినవి. అయితే, అప్పట్లో ఖజానా ఖాళీ అవ్వడం, సంక్షేమ పథకాల పేరుతో నిధులను మళ్లించడంతో ఉద్యోగుల జీపీఎఫ్, గ్రాట్యూటీ వంటి హక్కుల మీద కూడా జగన్ సర్కార్ చెయ్యి వేసింది. ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకేసారి ఇవ్వలేక.. అప్పట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారనే విమర్శలు ఉన్నాయి. అలా రెండేళ్ల పాటు చెల్లింపులను వాయిదా వేసి, ఆ నెపాన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వంపైకి తోసేశారు.
జగన్ రెడ్డి సృష్టించిన ఈ ఆర్థిక సంక్షోభం తన మీద పడినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఉద్యోగులకు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కష్టపడి పని చేసే ఉద్యోగుల హక్కులను కాలరాయకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే కాకుండా, సర్వీసులో ఉన్న పోలీసు సిబ్బందికి కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. జగన్ హయాంలో ధర్నాలు చేసినా కనికరించని ప్రభుత్వం చూసిన ఉద్యోగులు, ఇప్పుడు అడగకుండానే తమ బకాయిలు చెల్లిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
