దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోస్తున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతున్నా, అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు మాత్రం లైట్ తీసుకుంటున్నట్లుగా ఉంది. పార్టీలో అత్యంత అనుభవం ఉన్న నాయకుడు అలిగితే, కనీసం పీసీసీ అధ్యక్షుడు లేదా రాష్ట్రస్థాయి కీలక నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి ఉంటుంది. కానీ, ఆయన కంటే రాజకీయంగా ఎంతో జూనియర్ అయిన ఒక ఎమ్మెల్యేను రాయబారానికి పంపడం చూస్తుంటే, గాంధీభవన్ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్థమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తీరు కేవలం ఒక మొక్కుబడి వ్యవహారంగానే సాగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనను పార్టీలో కొనసాగించాలనే బలమైన ఆకాంక్ష అధిష్టానానికి ఉన్నట్లు కనిపించడం లేదని, అందుకే సీనియారిటీని కూడా గౌరవించకుండా జూనియర్ నేతలతో రాయబారాలు నడిపిస్తున్నారని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టున్న జీవన్ రెడ్డి వంటి నేతను దూరం చేసుకోవడం వల్ల పార్టీకి కలిగే నష్టం కంటే, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే ముఖ్యం అన్నట్లుగా అధికార పార్టీ నేతల తీరు ఉందని జీవనం రెడ్డి వర్గీయులు అంటున్నారు. గౌరవం లేని చోట ఉండలేనని ఆయన గట్టి నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. అయితే పార్టీ నుంచి ఏదైనా గట్టి హామీ వస్తే.. ఆయన మెత్తబడే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి హామీలు ఇచ్చే ఉద్దేశం ప్రస్తుత నాయకత్వానికి లేదని అర్థమవుతోంది.


