తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు, కృష్ణా-గోదావరి బేసిన్లలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పీపీటీని ఒక అస్త్రంగా ఎంచుకుంది. ఇందుకు అసెంబ్లీ హాలులో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైంది.
అయితే, ప్రభుత్వ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్, తాము కూడా పీపీటీని స్వాగతిస్తున్నామని ప్రకటించింది. కానీ, ప్రభుత్వంతో పాటు తమకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమయం కేటాయించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇచ్చే వారు కాదని, పీపీటీలకు అస్సలు తావు లేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పాటించిన సంప్రదాయాలనే తాము కూడా అనుసరిస్తామని చెబుతున్నారు. రతిపక్షానికి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లేదని పరోక్షంగా తేల్చి చెబుతున్నారు. నాడు తాము అడిగినా ఇవ్వని వెసులుబాటును, నేడు బీఆర్ఎస్ ఏ మొహం పెట్టుకుని అడుగుతోందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో జరగనున్న ఈ పీపీటీ యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సభలో ప్రభుత్వం ఇచ్చే పీపీటీని అడ్డుకుంటారా లేక సభ బయట తాము విడిగా ప్రజెంటేషన్ ఇస్తారా అన్నది బీఆర్ఎస్ తేల్చుకోవాల్సి ఉంది.


