రాజీనామా చేయను .. సస్పెండ్ చేయండి..! కేసీఆర్ కు డీఎస్ లేఖ..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వ్యూహంలో చిక్కుకుని రాజ్యసభ సభ్యుడు డీఎస్ చిక్కుకుని ఎలా బయటపడాలో తెలియక తికమకపడుతున్నారు. ముందస్తు ఎన్నికల భేరీ మోగుతూండటంతో సీనియర్ గా తన పాత్ర ఏమీ లేకుండా పోయే పరిస్థితి రావడంతో.. ఆయన మీడియా ముందుకు వచ్చారు. నిజామాబాద్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తనను సస్పెండ్ చేయాలని సవాల్ చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇష్టం లేకపోతే.. తనపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కవితతో పాటు ఇతర జిల్లా నేతలు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి తనపై కక్ష కట్టిందని డీఎస్ లేఖలో పేరొన్నారు. తన కుమారుడు సంజయ్ ను అక్రమంగా కేసుల్లో ఇరికించారని.. డీఎస్ మండిపడ్డారు. సంజయ్ విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడమే కాకుండా .. కుటుంబాన్ని రోడ్డుకీడ్చారని లేఖలో డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో ఉన్నానని.. అలాంటిది తనపై పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డానన్న ఆరోపణలు చేయడం బాధ కలిగించిందన్నారు.

తెలంగాణ కోసం సమైక్యవాదులకు వ్యతిరేకంగా పోరాడానని డీఎస్ లేఖలో గుర్తు చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా కేసీఆర్ ఉన్న సభలోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించానన్నారు. తాను ఇప్పుడు రాజీనామా చేస్తే.. టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లవుతుందని.. తనకు తానుగా రాజీనామా చేయబోనని డీఎస్ లేఖలో స్పష్టం చేశారు. దాదాపుగా రెండు నెలల క్రితం.. హఠాత్తుగా నిజామాబాద్ రాజకీయాల్లో డీఎస్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. కవిత నేతృత్వంలో.. టీఆర్ఎస్ నేతలందరూ సమావేశమై.. డీఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. దాన్ని కేసీఆర్ కు పంపారు. అంతకు కొద్దిసేపటికి ముందే డీఎస్ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నాడని.. సోనియాను కలిశారని ప్రచారం జరిగింది. అదే సమయంలో అనుచరులతో సమావేశానికి డీఎస్ ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ తాను కాంగ్రెస్ నేతలెవర్నీ కలవలేదని డీఎస్ ప్రకటించారు. సీఎంతో భేటీకి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. అప్పట్నుంచి ఆయన అలా అటు టీఆర్ఎస్.. ఇటు ఇతర పార్టీలకు కాకుండా అయిపోయారు.

ఈ మధ్య కాలంలో ఆయన పెద్ద కొడుకుపై లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. మూడు రోజుల కిందటే బెయిల్ తెచ్చుకున్నారు. ప్రగతి నివేదన సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించడానికి తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా డీఎస్ వెళ్లారు. కానీ అక్కడెవరూ పట్టించుకోలేదు. పార్టీకి భారంగా మారిన నేతలను వదిలించుకునేందుకు.. కేసీఆర్ ఇలాంటి వ్యూహాలే పన్నుతూంటారు. ఒంటరిని చేసి పక్కన పెట్టేస్తారు. నిజామాబాద్ లోనే భూపతిరెడ్డి అనే ఎమ్మెల్సీ పరిస్థితి కూడా అంతే ఉంది. ముందస్తు ఎన్నికలు ఖాయం కావడంతో.. ఏదో ఒకటి చేయాలనుకుని.. డీఎస్ నే ముందుకు వచ్చి.. ధిక్కార స్వరం ప్రారంభించిటన్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ కు ఇప్పుడు డీఎస్ వ్యవహారం పట్టించుకునేంత తీరిక ఉందా..? అనేదే సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com