Dacoit Movie Review
Dacoit Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకోవడం అంత ఈజీ కాదు. ‘ఈ హీరో సినిమాకెళ్తే డబ్బులు గిట్టుబాటు అవుతాయి’ అనే భరోసా చాలా కొద్ది మంది హీరోలకే దక్కుతుంది. అడవిశేష్ ది ఈ కేటగిరీనే. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్.. ఈ లిస్టు చెబుతుంది శేష్ సంపాదించుకొంది ఏమిటో? తనలో ఓ కథకుడు, దర్శకుడు ఉండడం వల్ల, తనకు ఎలాంటి కథలు నప్పుతాయో తెలియడం వల్ల… తన ప్రయాణం మరింత సులభం అవుతోంది. ‘డెకాయిట్’ కథ కూడా తనదే. ‘మేజర్’ లాంటి సూపర్ డూపర్ హిట్ తరవాత చేసిన సినిమా ఇది. ప్రేమకథ అనే కలరింగు ఇవ్వడం వల్ల, అనురాగ్ కశ్యప్ లాంటి నటుడ్ని తోడు తెచ్చుకోవడం వల్ల, అన్నపూర్ణ ప్రొడక్షన్స్ తోడవ్వడం వల్ల… ‘డెకాయిట్’కి మరింత క్రేజ్ వచ్చింది. మరి ఇన్ని హంగులున్న ‘డెకాయిట్’ ఎలా వుంది? అడవిశేష్ ఈసారి వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్ చేశాడు?
హరి (అడవిశేష్) హత్యా నేరంపై పదమూడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. ఎలాగైనా సరే, బయటకు వచ్చేయాలనుకొంటాడు. అందుకే అదును చూసి తప్పించుకొంటాడు. దొంగ పాస్ పోర్ట్‌తో విదేశానికి పారిపోవాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం కొంత డబ్బు కావాలి. ఆ డబ్బుకోసం దొంగతనం చేయాలి. ఈ దొంగతనం సక్సెస్ కావాలంటే తనకో డ్రైవర్ కావాలి. తన డ్రైవర్ గా సరస్వతి (మృణాల్ ఠాకూర్)ని ఎంచుకొంటాడు. సరస్వతి తన మాజీ ప్రేమికురాలు. హరి జైలు జీవితం గడపడానికి కారణం తనే. అయినా సరే, సరస్వతిని పార్టనర్‌గా ఎందుకు తీసుకొన్నాడు? ఈ దోపిడీకి సహాయం చేయడానికి సరస్వతి ఎందుకు ఒప్పుకొంది? వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైంది, ఎందుకు విడిపోవాల్సివచ్చింది? అసలు దోపిడీ సజావుగా జరిగిందా, లేదా? ఇవన్నీ వెండి తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
క్రైమ్నీ, ప్రేమనీ ముడి పెట్టిన కథ ఇది. నిజానికి ఇవి రెండూ డిఫరెంట్ జోనర్లు. వీటి కలయిక వల్ల ఈ కథకు కొంత అదనపు అందం వచ్చింది. ప్రేమని, క్రైమ్ నీ దర్శకుడు బ్యాలెన్స్ చేయగలిగాడు. తొలి పది నిమిషాల్లో హరి- సరుల ప్రేమ కథ నడుస్తుంది. ఆ లవ్ ట్రాక్ కాస్త బోర్ కొడుతుంది. కాకపోతే కథకు అదే ఆలంబన కాబట్టి, కాస్త ఓపిగ్గా చూడాలి. ఆ తరవాత హరి జైల్లోంచి పారిపోవడానికి వేసే స్కెచ్, అక్కడి డ్రామా ఆసక్తిని పెంచుతుంది. ఆ వెంటనే ఓ ఐటెమ్ సాంగ్ వస్తుంది. ఆ పాట జోష్ గా సాగడం, తొలిసారి అడవిశేష్ హుషారైన స్టెప్పులు వేయడంతో పాట కూడా పాసైపోతుంది. హరి దుబాయ్ పారిపోయే ప్రయత్నంలో డబ్బు అవసరం అవ్వడం, అందుకోసం దొంగతనం చేయాలనుకోవడం, దాని కోసం సరుని పార్టనర్‌గా ఎంచుకోవడం ఈ కథలోని అసలైన విశేషాలు. ఏ దొంగైనా బ్యాంకు దోపిడీ చేయాలనుకొంటాడు.కానీ ఈసారి హాస్పటల్ లో సొమ్ము దోచుకొంటారు. అది కాస్త వైవిధ్యంగా కనిపిస్తుంది. కాకపోతే కరోనా నాట పరిస్థితులు, అప్పటి వాతావరణం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఆసుపత్రుల్లో జరిగిన దోపిడీ మరోసారి కళ్లకు కట్టారు. కరోనా ఓ చేదు జ్ఞాపకం. దాన్ని నెమరు వేసుకొనే శక్తి ఎంతమంది ప్రేక్షకులకు ఉందో? ఇలాంటి విషయాల్ని ఎవాయిడ్ చేసినా కథకొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ రచయిత శేష్ ఆ దిశగా ఆలోచించలేదు.
సరస్వతిని ఈ దోపిడీలో పార్టనర్ ఎందుకు చేశారన్న విషయంలో లాజిక్ కరెక్ట్ గానే వేసుకొన్నాడు దర్శకుడు. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా బాగుంది. ఫస్టాఫ్ చూసేసరికి ప్రేమ కథ కంటే, దోపిడీ.. అందుకు హీరో వేసిన స్కెచ్చే ఎక్కువగా గుర్తొస్తుంది. సెకండాఫ్‌లో మాత్రం `డెకాయిట్`ని ఓ ప్రేమకథగా మలిచే ప్రయత్నం చేశాడు. కొన్ని మలుపులు ప్రేక్షకులు ముందుగానే ఊహించినా, ఒకట్రెండు ట్విస్టులు మాత్రం కాస్త కొత్తగా, షాకింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఓ పాత తెలుగు సినిమాని గుర్తుకు తెస్తుంది. కానీ అది కూడా పాస్ అయిపోతుంది.
అండర్ లైన్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ముందే చెప్పి, వాటికి పే ఆఫ్ ఇచ్చుకుంటూ వెళ్లడం బాగుంది. ‘ఉంగరం’ గురించిన ఓ డైలాగ్.. ఎక్కడో తొలి సన్నివేశంలో వినిపించినప్పుడు ‘ఈ డైలాగ్ ఎందుకు అనవసరంగా’ అనిపిస్తుంది.కానీ.. చివర్లో ఆ డైలాగ్ కి జస్టిఫికేషన్ జరిగిపోతుంది. ఇలాంటి పే ఆఫ్‌లు బాగా కుదిరాయి. నిజానికి కథా పరంగా చాలా ఫ్లాట్ గా ఉన్న సినిమా ఇది. మలుపులు కొన్ని గెస్ చేయొచ్చు కూడా. కానీ అలాంటి తరుణంలోనూ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి కలిగిందంటే దానికి కారణం ఎడిటింగ్ పేట్రన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఫ్లాట్ గా రాసుకొన్న సీన్ ని ఎడిటింగ్ లో అటు మార్చి, ఇటు మార్చి… ఏదో జరిగిపోతోందన్న భ్రమ తీసుకొచ్చాడు దర్శకుడు. రెండు సీన్లను.. మిక్డ్స్ గా కట్ చేసి అక్కడో షాట్, ఇక్కడో షాట్, అక్కడో డైలాగ్, ఇక్కడో డైలాగ్ చెబుతూ, పాత విషయానికే కొత్త రంగు పులిమే ప్రయత్నం చేశాడు. ఇలాంటి జిమ్మిక్కులతో సినిమా కాస్త కొత్త కలరింగు తెచ్చుకోగలిగింది.
స్క్రిప్టు పరంగా శేష్ ఎప్పుడూ పకడ్బందీగా ఉంటాడు. ఈ కథలోనూ అది కనిపించింది. ప్రేక్షకులు అండర్ లైన్ చేయలేని విషయాలకు పే ఆఫ్ ఇచ్చిన విధానం ఆకట్టుకొంటుంది. కానీ కొన్ని లాజిక్కుల్ని వదిలేయడం కూడా ఆశ్చర్యపరుస్తుంది. మాలలో ఉన్న పోలీస్ ఆఫీసర్ గన్ను పట్టుకోకూడదు అనుకోవడం ఏమిటి? వృత్తి, భక్తి రెండూ వేర్వేరు కదా? వాటికి ఎలా ముడి పెడతారు? అదేం లాజిక్కు? కరోనా సమయంలో నడిచే కథ ఇది. అప్పటికి రెండు వేల నోట్లు రద్దు అయిపోయాయి. వాటిని ఇంకా చలామణిలో ఉన్నట్టు చూపించడం ఏమిటి? ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించే న్యూ ఏజ్ మేకర్స్ ఇలాంటి సిల్లీ లాజిక్కులు ఎందుకు వదిలేశారో..?
శేష్ ప్రేమకథలు చేయలేదు. తనకు ఈ పాత్ర కొత్తగానే ఉంటుంది. మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే మెల్లమెల్లగా చేస్తున్నాడు అనిపిస్తోంది. సినిమాలోని దాదాపు ప్రతీ సీన్లోనూ తనే కనిపిస్తాడు. మృణాల్ మంచి ఆప్షన్. తన వల్ల ఆ పాత్రకు బిలివబులిటీ వచ్చింది. సింపతీ వర్కవుట్ అయ్యింది. అనురాగ్ కాశ్యప్ లాంటి నటుల్ని ఎంచుకొన్నప్పుడు ఆ పాత్ర నుంచి ఇంకేదో ఆశిస్తారు ప్రేక్షకులు. అది వాళ్ల తప్పు కాదు. అనురాగ్ క్యారెక్టర్ డీసెంట్ గానే ఉంది కానీ, ఆయన స్థాయికి తగిన పాత్ర అయితే కాదు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్… వీళ్లంతా ఓకే అనిపిస్తారు. ‘వావ్’ అనే నటన మాత్రం ఆశించలేం.
టెక్నికల్ విభాగం ఈ సినిమాని నాలుగు వైపుల నుంచి భుజం కాసింది. ముఖ్యంగా ఎడిటింగ్ పేట్రన్ బాగుంది. నేపథ్య సంగీతం కొత్తగా వినిపించింది. కన్నెపెట్టరో పాటని వాడుకొన్న విధానం బాగుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. చిన్న పాత్రకు సైతం తెలిసిన నటుల్ని తీసుకోవడం వల్ల చాలా విషయాలు ఈజీగా కన్వే అయిపోయాయి.
‘డెకాయిట్’ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే – కమర్షియల్ మీటర్లో సాగిన ప్రేమకథలో, క్రైమ్ జోడించిన ఎమోషన్ కథ ఇది. ఇందులో చాలానే పార్శాలు కనిపిస్తాయి. టికెట్ రేటు గిట్టుబాటు అయ్యే స్టఫ్ అందించడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
