దాస‌రి ద‌గ్గ‌రుండి రివ్యూలు రాయిస్తారా?

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు…సినిమాల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా రివ్యూల‌తో లింకులు క‌ట్టి మాట్లాడుతుంటారు సినీ మేధావులు.

స‌మీక్ష‌లు ఉండాలా, వ‌ద్దా.. సమీక్ష‌లు రాసేవాళ్ల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లేంటి? సినిమాని స‌మీక్ష‌ల పేరుతో చంపేసే అధికారం మీకు ఎవ‌రిచ్చారు? సినిమా విడుద‌లైన రోజునే రివ్యూ ఎందుకు నాలుగు రోజులు ఆగొచ్చుగా….. ఇలా స్పీచుల‌తో దంచి పారేస్తుంటారు. ఇదంతా నెటిటీవ్ రివ్యూలొచ్చిన‌ప్పుడే. అదే పాజిటీవ్ రివ్యూలు రాస్తే.. ‘మాకు మంచి రివ్యూలొచ్చాయి. ఫ‌లానా వాళ్లు నాలుగు స్టార్లు వేశారు’ అంటూ గొప్ప‌గా చెప్పుకొంటారు. సినిమా వాళ్ల పేప‌ర్ యాడ్‌లో వెబ్ సైట్లూ, వాళ్లిచ్చిన రేటింగుల‌తో ఓ యాడ్ క‌చ్చితంగా ఉంటుంది. అంటే సినిమా బాగుంద‌న్న రివ్యూల‌కే విలువ ఇస్తారా, లేదంటే ఇలా రివ్యూల‌పై రివ్యూలిస్తుంటారా.. ఇదెక్క‌డి న్యాయం?

తాజాగా దాస‌రి కూడా రివ్యూల‌పై గ‌ళం ఎత్తారు. రివ్యూల పేరుతో కొన్ని వెబ్ సైట్లు సినిమాని తొక్కేస్తున్నాయ‌ని, వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో సినిమాల్ని చంపేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా, చిన్న సినిమాల కొమ్ము కాసే నాయ‌కుడిగా ఆయ‌న ఆవేద‌న‌లో, వ్యాఖ్య‌ల్లో అర్థం ఉంది. కాక‌పోతే ‘గుడ్ సినిమా ప్ర‌మోట‌ర్స్‌’ అంటూ ఆయ‌న ఓ క‌మిటీ వేస్తార‌ట‌. వాళ్లంతా మంచి సినిమాల్ని ప్రొత్స‌హించి వాటికి ప్ర‌చారం క‌ల్పించేందుకు పాటు ప‌డ‌తార‌ట‌. వాళ్లే రివ్యూల్ని వ‌దులుతార‌ట‌. ఇదీ.. దాస‌రి గారి మాట‌! గుడ్ సినిమా ప్ర‌మోట‌ర్సా? అంటే ఏంటి? ‘మంచి సినిమా వ‌చ్చింది చూడండి’ అని చెప్ప‌డమే క‌దా? రివ్యూలు చేసేది అదే క‌దా? ఇటీవ‌ల `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` సినిమా వ‌చ్చింది. ఆ సినిమా బాగుంద‌నే అంద‌రూ రివ్యూలు రాశారు. ద‌ర్శ‌కుడినీ అందులో న‌టించిన వాళ్ల‌ని పొగుడుతూ పేరాలు పేరాలు ఆర్టికల్స్ వ‌చ్చాయి. ఇదంతా ప్ర‌మోష‌న్ కాదా? దాస‌రి కొత్త‌గా చేసేదేముంది? పైగా దాస‌రి మాట్లాడిన సంద‌ర్భం కూడా ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ స‌క్సెస్ మీట్‌లోనే. ఆ సినిమాని ప్రోత్సహించిందే వెబ్ మీడియా. అలాంట‌ప్పుడు అదే ఫంక్ష‌న్‌లో రివ్యూల‌పై వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డం ఏమిటి? దాస‌రి వ్యాఖ్య‌లు స‌రైన‌వైనా.. చెప్పింది మాత్రం రాంగ్ టైమ్‌లో! మొత్తానికి రివ్యూలు రాయ‌డానికి నా బ్యాచ్ ఒక‌టి సిద్ధ‌మ‌వుతోంది అన్న సంకేతాల్ని పంపించేశారు దాస‌రి. అది మాత్రం క‌న్‌ఫామ్ అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com